DK Shivakumar Oath Ceremony
ఆకేరు న్యూస్, డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో ఈరోజు సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. సీనియర్ కాంగ్రెస్ నేత, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ కర్ణాటక రాష్ట్ర 34వ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో సాయంత్రం 4:05 గంటలకు జరిగే ఘనమైన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో సీఎం పదవి ప్రమాణం చేయించనున్నారు. ఇటీవల సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, కాంగ్రెస్ అధిష్ఠానం డీకే శివకుమార్‌ను నూతన శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
* మంత్రులుగా 10 నుండి 15 మంది..
ముఖ్యమంత్రితో పాటు దాదాపు 10 నుండి 15 మంది మంత్రులు కూడా ఈ రోజు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన తుది జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేస్తోంది. కాగా, సీనియర్ నేత జి. పరమేశ్వరతో పాటు పలువురు కీలక నాయకులకు నూతన మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. రాబోయే రాజ్యసభ ఎన్నికల తర్వాత ఈ మంత్రివర్గాన్ని మరింత విస్తరించనున్నట్లు సమాచారం.
* హాజరుకానున్న ప్రముఖులు..
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా హాజరుకానున్నారు. వీరితో పాటు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి (తెలంగాణ), వి.డి. సతీశన్ (కేరళ సీఎం ప్రతినిధి), సుఖ్విందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్) తదితరులు విచ్చేస్తున్నారు. ప్రముఖ మఠాధిపతులు, సామాజిక సంస్కర్తలు, రైతు నేతలతో పాటు డీకే శివకుమార్ చదువుకున్న దొడ్డాలహళ్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం విశేషం.
* 2028 ఎన్నికలపై కాంగ్రెస్ కన్ను
పవర్ షేరింగ్ (అధికార భాగస్వామ్యం) ఒప్పందంలో భాగంగానే ఈ మార్పు జరిగినప్పటికీ, 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అధిష్ఠానం డీకే శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత అయిన డీకే శివకుమార్ సారథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని హైకమాండ్ యోచిస్తోంది. నూతన ప్రభుత్వం ఏర్పాటుతో కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
