World Bicycle Day Memories
ఆకేరు న్యూస్, డెస్క్: ఈరోజు జూన్ 3, ప్రపంచ సైకిల్ దినోత్సవం. క్యాలెండర్లో ఈ తేదీని చూడగానే ఈ తరం వాళ్లకు కేవలం ఒక సాధారణ ‘డే’ లాగా అనిపించవచ్చు. కానీ, 80లు, 90ల కాలంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికీ గుండెల్లో ఒక తీపి అలజడి మొదలవుతుంది. గ్యారేజీలోనో, పెరట్లోనే దుమ్ము పట్టి మూలన పడి ఉన్న పాత సైకిల్‌ను చూస్తే.. మన చిన్నతనం అంతా ఆ రెండు చక్రాల చుట్టూనే తిరిగినట్లు అనిపిస్తుంది. నేడు లక్షలు పోసి కొనే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైకులు ఇవ్వలేని ఒక వింతైన స్వేచ్ఛను, అమాయకపు సంతోషాన్ని ఆ రోజుల్లో ఆ పాత సైకిల్ మనకు ఇచ్చింది.
* అసలు చారిత్ర లోకి వెళ్తే…
మన జీవితాల్లోకి ఎలా వచ్చాడు? దీని వెనుక ఉన్న 200 ఏళ్ల చరిత్రతో పాటు మన ఎమోషనల్ బంధాన్ని ఒక్కసారి తవ్వి తీద్దాం.
సైకిల్ పురిటిగడ్డ జర్మనీ. సరిగ్గా 1817వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి దాదాపు 209 సంవత్సరాల క్రితం జర్మనీకి చెందిన ప్రముఖ ఆవిష్కర్త బారన్ కార్ల్ వాన్ డ్రైస్ (Baron Karl von Drais) మొదటి సైకిల్‌ను కనిపెట్టారు. 1817 జూన్ 12న ఆయన తాను తయారు చేసిన వాహనాన్ని జర్మనీలోని ‘మ్యాన్‌హీమ్’ నగరం నుండి ‘రీనావ్’ వరకు నడిపి ప్రజలకు ప్రదర్శించారు.
కానీ, ఆ మొదటి సైకిల్ మనం ఇప్పుడు చూస్తున్నట్లు ఉండేది కాదు. దానికి పెడల్స్ లేవు, చైన్ లేదు. పూర్తిగా చెక్కతో చేసిన ఆ వాహనంపై కూర్చుని, కాళ్లతో నేలను వెనక్కి నెడుతూ ముందుకు వెళ్లాల్సి వచ్చేది. అందుకే దీనిని అప్పట్లో ‘రన్నింగ్ మెషిన్’ లేదా ‘డాండీ హార్స్’ అనేవారు. ఆ తర్వాత 1860లలో ఫ్రాన్స్ దేశంలో దీనికి పెడల్స్ వచ్చాయి. ఇనుప చక్రాల వల్ల ఒళ్లంతా నొప్పులు పుట్టే ఈ సైకిళ్లను ‘బోన్షేకర్’ (ఎముకలు కుదిపేసేది) అని పిలిచేవారు. చివరిగా 1885లో బ్రిటన్‌కు చెందిన జాన్ కెంప్ స్టార్లీ వెనుక చక్రానికి చైన్ అమర్చి, 1888లో జాన్ బాయిడ్ డన్లప్ గాలితో నింపే రబ్బర్ టైర్లను కనిపెట్టడంతో మనకు తెలిసిన ఆధునిక సైకిల్ రూపుదిద్దుకుంది.
* నాన్న కొనిచ్చిన ‘విమానం’.. మోకాళ్లు పగిలిన జ్ఞాపకం..
చరిత్ర ఎలాగైనా ఉండనివ్వండి.. కానీ మన చిన్నతనంలో సైకిల్‌తో ఉన్న అనుబంధం మాత్రం పూర్తిగా వేరు. ఇంట్లో ఎన్నో బతిమిలాటలు, మారాంల తర్వాత నాన్న సైకిల్ కొని ఇంటికి తెచ్చిన ఆ రోజు.. మన పాలిట అది ఒక పెద్ద విమానమే. మొదటిసారి సైకిల్ నేర్చుకునేటప్పుడు వెనుక క్యారియర్ పట్టుకుని, “నాన్న.. పట్టుకున్నావా? వదల్లేదు కదా?” అని భయంతో అడుగుతుంటే.. “నువ్వు తొక్కురా నేనున్నా” అంటూ వెనుక నడుస్తూ, మనకు తెలియకుండానే నాన్న చేతులు వదిలేసిన ఆ క్షణం.. జీవితంలో ఒంటరిగా ఎలా నిలదొక్కుకోవాలో నేర్పిన మొదటి పాఠం.
సైకిల్ నేర్చుకునే క్రమంలో మోకాళ్లు పగిలినా, మోచేతులు గీసుకుపోయినా ఆ నొప్పులు అస్సలు తెలిసేవి కావు. పడినా సరే, మళ్లీ లేచి పెడల్ తొక్కాలనే ఆ కసి, ఆ మొండితనం ఈరోజు మనల్ని జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనేలా చేశాయి.
* ఊరంతా మనదే అనే స్వేచ్ఛ దోస్తుల ముచ్చట్లు….
సాయంత్రం అయితే చాలు.. స్నేహితులమంతా గ్యాంగ్ లాగా తయారై సైకిళ్లపై ఊరంతా తిరిగిన రోజులు గుర్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. చేతులు వదిలేసి సైకిల్ తొక్కడం ఒక పెద్ద సాహసకృత్యం. వెనక సీట్లో కూర్చున్న దోస్తుగాడు “ఒరేయ్ పడతాంరా బాబు.. హ్యాండిల్ పట్టుకో!” అని గట్టిగా అరుస్తుంటే వచ్చే నవ్వే వేరు.
సైకిల్ వెనుక క్యారియర్‌పై కూర్చుని స్కూల్ ముచ్చట్లు చెప్పుకోవడం, డబుల్ రైడింగ్ కొడుతూ అలసిపోయినా నవ్వుతూ పెడల్స్ తొక్కడం.. ఇప్పటికీ మనసులో పచ్చగానే ఉన్నాయి. చైన్ ఊడిపోతే చేతులకు గ్రీస్ పూసుకుని మళ్లీ ఎక్కించడం, టైర్ పంచర్ అయితే ఆ షాపు దగ్గర నిలబడి ఆశగా చూడటం.. అదొక సజీవమైన అనుభవం.
* వేగం పెరిగింది.. కానీ సంతోషం ఎక్కడ..
ఈ రోజు మన దగ్గర వేగంగా వెళ్లే బైకులు ఉన్నాయి, ఏసీ కార్లు ఉన్నాయి. కానీ, ఆ రోజుల్లో సైకిల్ తొక్కుతున్నప్పుడు ముఖాన్ని తాకిన ఆ చల్లటి గాలి, ఆ మనశ్శాంతి ఈ రోజుల్లో లభించడం లేదు. ఇప్పుడు జిమ్‌లకు వెళ్లి వేల రూపాయలు తగలేస్తూ ట్రెడ్మిల్ మీద పరిగెడుతుంటే నవ్వొస్తుంది. నాన్నమ్మ, తాతయ్యలు చెప్పేవాళ్లు.. “ఆ రోజుల్లో మైళ్ల దూరం సైకిల్ తొక్కేవాళ్ళం రా, అందుకే మా ఒళ్ళు అంత గట్టిగా ఉంది” అని. అది ఎంత నిజమో ఇప్పుడు అర్థమవుతోంది. శారీరక శ్రమ లేక, కాలుష్యపు పొగలో నలిగిపోతూ రోగాల పాలవుతున్న ఈ రోజుల్లో.. సైకిల్ విలువ మరింతగా తెలుస్తోంది.
* జ్ఞాపకాల పెడల్…
జర్మనీలో ఒక చిన్న చెక్క నమూనాగా ప్రారంభమైన సైకిల్ ప్రయాణం.. కోట్ల మంది జీవితాల్లో ఎమోషనల్ బంధంగా మారింది. కేవలం ఒక రోజు సైకిల్ తొక్కి ఫొటోలకు ఫోజులివ్వడం కాకుండా.. వారంలో కనీసం ఒక్క రోజైనా, లేదా పక్కనే ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లడానికైనా మన పాత మిత్రుడిని (సైకిల్‌ను) బయటకు తీద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. మన చిన్ననాటి ఆరోగ్యాన్ని, ఆ అమాయకపు సంతోషాన్ని మళ్లీ సొంతం చేసుకుందాం. మళ్లీ ఆ హ్యాండిల్ పట్టుకుందాం.. జ్ఞాపకాల పెడల్ తొక్కుదాం!
