Jaspal Rana Death
ఆకేరు న్యూస్, డెస్క్: భారత క్రీడారంగంలో గురువారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశం గర్వించదగ్గ షూటింగ్ దిగ్గజం, ఒలింపియన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు స్టార్ షూటర్ మను భాకర్ కోచ్ అయిన జాస్పల్ రానా (49) గారు కన్నుమూశారు. జర్మనీ నుంచి తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురైన ఆయన, ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.
* మరణానికి దారితీసిన పరిస్థితులు..
వైద్యులు మరియు కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) వరల్డ్ కప్ ముగించుకుని తిరిగొస్తున్న సమయంలో జాస్పల్ రానాకు విమానంలో తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చింది.
అయితే ఆయన దానిని సాధారణ గ్యాస్ ట్రబుల్ లేదా ఎసిడిటీ (Acidity) అనుకుని నిర్లక్ష్యం చేశారు. అదే నొప్పితో ప్రయాణాన్ని కొనసాగించారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్… అయిన వెంటనే ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు సాకేత్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయనకు గుండెపోటు వచ్చి మూడు రోజులు దాటిపోవడంతో, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమని (Artery) పూర్తిగా బ్లాక్ అయిపోయింది.
వైద్యులు ఆయనకు అత్యవసరంగా స్టెంట్ (Stent) సర్జరీ చేసినప్పటికీ, గుండె పంపింగ్ సామర్థ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన కోలుకోలేక హాస్పిటల్లోనే కన్నుమూశారు.
* భారత షూటింగ్ రారాజు..
1976 జూన్ 28న ఉత్తరాఖండ్‌లో జన్మించిన జాస్పల్ రానా.. భారత షూటింగ్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మొదటి తరం ఆటగాళ్లలో ఒకరు.
మెడల్స్ వేట: కామన్వెల్త్ గేమ్స్‌లో 9 బంగారు పతకాలతో సహా మొత్తం 15 మెడల్స్ సాధించి, ఈ గేమ్స్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన భారతీయ అథ్లెట్‌గా నిలిచారు.
ఆసియా గేమ్స్ రికార్డు: ఏషియన్ గేమ్స్‌లో 4 గోల్డ్ మెడల్స్‌తో కలిపి మొత్తం 8 పతకాలు గెలిచారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడల్లో 25 మీటర్ల సెంటర్-ఫైర్ పిస్టల్ ఈవెంట్లో ప్రపంచ రికార్డును సమం చేస్తూ 3 బంగారు పతకాలను కొల్లగొట్టారు.
ప్రభుత్వ పురస్కారాలు: ఆయన అద్భుత ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1994లో అర్జున అవార్డు, 1997లో దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. 2020లో ద్రోణాచార్య అవార్డును కూడా అందుకున్నారు.
* మను భాకర్‌కు గురువుగా.. చారిత్రాత్మక విజయం
ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత జాస్పల్ రానా కోచ్‌గా మారి ఎంతోమంది యువ షూటర్లను తీర్చిదిద్దారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ చారిత్రాత్మకమైన రెండు కాంస్య పతకాలు (Bronze Medals) గెలవడంలో జాస్పల్ రానా కోచింగ్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఒలింపిక్స్ ఒత్తిడిని తట్టుకునేలా ఆయన మను భాకర్‌కు కఠినమైన శిక్షణ ఇచ్చారు. ఇటీవల భారత పిస్టల్ షూటింగ్ రంగానికి ఆయన ‘హై-పెర్ఫార్మెన్స్ కోచ్’గా సేవలు అందిస్తున్నారు.
* ప్రముఖుల సంతాపం..
జాస్పల్ రానా హఠాన్మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “జాస్పల్ కేవలం నా టీమ్మేట్ మాత్రమే కాదు, భారత షూటింగ్‌ను మలుపు తిప్పిన ఒక గొప్ప తరం ప్రతినిధి. ఆయన మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది” అని ఎమోషనల్ అయ్యారు.
పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు రానా కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
