India A vs Sri Lanka A Super Over
* సూపర్ ఓవర్లో శ్రీలంక-ఏ విజయం
* శ్రీలంకతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం
ఆకేరు న్యూస్, డెస్క్ : క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఉత్కంఠభరిత మ్యాచ్‌కు దంబుల్లా వేదికైంది. ఇండియా-ఏ (INDIA-A), శ్రీలంక-ఏ (SRI LANKA-A) మధ్య జరిగిన ముక్కోణపు వన్డే పోరులో టై, సూపర్ ఓవర్, అంపైరింగ్ వివాదం, ఆటగాళ్ల మధ్య వాగ్వాదం మాత్రమే కాదు.. క్రికెట్ చరిత్రలో అరుదుగా కనిపించే ఒక విచిత్ర సంఘటన కూడా చోటుచేసుకుంది. చివరకు సూపర్ ఓవర్లో శ్రీలంక-ఏ విజయం సాధించగా.. భారత్ ఓటమికి విప్రజ్ నిగమ్ చేసిన ఒక బ్లండర్ ప్రధాన కారణంగా మారింది.
* ఒక్క బంతి ఆడకుండానే శ్రీలంక స్కోరు 10/0!
సాధారణంగా బ్యాటర్లు పరుగులు చేస్తేనే స్కోరు బోర్డు కదులుతుంది. కానీ ఈ మ్యాచ్‌లో శ్రీలంక-ఏ జట్టు చేజింగ్ ప్రారంభించే సమయానికి స్కోరు ఇప్పటికే 10/0గా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
భారత్ ఇన్నింగ్స్ సమయంలో పిచ్ మధ్యలో ఉన్న ‘ప్రొటెక్టెడ్ ఏరియా’లో ఆటగాళ్లు వరుసగా పరుగెత్తడంతో అంపైర్లు చర్యలు తీసుకున్నారు. ముందుగా అనుకుల్ రాయ్ చేసిన తప్పుకు హెచ్చరిక జారీ చేశారు. అనంతరం విప్రజ్ నిగమ్ రెండుసార్లు అదే నిబంధన ఉల్లంఘించడంతో అంపైర్లు రెండు దఫాలుగా ఐదేసి పరుగుల చొప్పున మొత్తం 10 పెనాల్టీ పరుగులు శ్రీలంక ఖాతాలో జమ చేశారు.
దీంతో శ్రీలంక ఒక్క బంతి కూడా ఎదుర్కోకముందే 10/0 స్కోరుతో తమ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో చాలా అరుదుగా కనిపించే ఈ సంఘటన మ్యాచ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
* చివరి బంతి వరకు ఉత్కంఠ
266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఏ జట్టు కెప్టెన్ సదీర సమరవిక్రమ (93) అద్భుత ఇన్నింగ్స్‌తో విజయానికి చేరువైంది. అయితే అర్షద్ ఖాన్ కీలక సమయంలో వికెట్లు తీసి భారత్‌ను మళ్లీ పోటీలోకి తీసుకొచ్చాడు.
చివరకు శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
* అంపైర్ల నిర్ణయంపై రచ్చ
మ్యాచ్ చివరి బంతి వద్ద మరో వివాదం చెలరేగింది. శ్రీలంక బ్యాటర్ చమిక గుణశేఖర షాట్ ఆడే ప్రయత్నం చేయలేదని భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే అంపైర్లు దాన్ని తిరస్కరించడంతో కెప్టెన్ తిలక్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
* సూపర్ ఓవర్లో శ్రీలంకదే పైచేయి
విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లో శ్రీలంక-ఏ మెరుగైన ప్రదర్శన చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇండియా-ఏ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. చివర్లో వైభవ్ సూర్యవంశీ భారీ షాట్లతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
దీంతో శ్రీలంక-ఏ సూపర్ ఓవర్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
* మ్యాచ్ ముగిసినా వేడి తగ్గలేదు
మ్యాచ్ అనంతరం కూడా ఉద్రిక్తత కొనసాగింది. భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడి మధ్య మైదానంలోనే వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఈ హైడ్రామా మ్యాచ్ మరింత చర్చనీయాంశమైంది.
