Telangana Police Arogya Bhadratha
ఆకేరు న్యూస్, డెస్క్:
తెలంగాణ పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న ‘ఆరోగ్య భద్రత’ (Arogya Bhadratha) పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ పథకం కింద ఎంపానెల్ ఆసుపత్రుల్లో అందిస్తున్న క్యాష్‌లెస్ వైద్య చికిత్స సేవలను 2026 జూలై 1 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ పోలీసు శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
* జూలై 1 నుంచి క్యాష్‌లెస్ సేవలు నిలిపివేత..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు క్యాష్‌లెస్ విధానంలో చికిత్స పొందుతున్నారు. అయితే, జూలై 1 నుంచి ఈ సౌకర్యం అందుబాటులో ఉండదని పోలీసు శాఖ స్పష్టం చేసింది.
* కొత్త ఆరోగ్య పథకం అమలు దిశగా ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ఆధ్వర్యంలో కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో పాత ‘ఆరోగ్య భద్రత’ పథకాన్ని దశలవారీగా నిలిపివేస్తోంది.
* ఉద్యోగుల జీతం నుంచి 1.5 శాతం చందా
కొత్త ఆరోగ్య పథకం అమలులో భాగంగా ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనంలో 1.5 శాతం చందా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ‘ఆరోగ్య భద్రత’ పథకం కోసం వసూలు చేస్తున్న నెలవారీ చందాను జూన్-2026 జీతం నుంచే నిలిపివేశారు.
* ప్రతి నెల 3వేల వైద్య బిల్లులు..
పోలీసు శాఖ సర్క్యులర్ ప్రకారం ప్రస్తుతం ‘ఆరోగ్య భద్రత’ పథకం ద్వారా ప్రతి నెల దాదాపు 3,000 వైద్య బిల్లులు వస్తున్నాయి. అయితే, ప్రస్తుత విధానంలో ప్రభుత్వం నుంచి ఇకపై వైద్య రీయింబర్స్మెంట్ అందే అవకాశం లేకపోవడంతో క్యాష్‌లెస్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
జూలై 1 నుంచి ఆరోగ్య భద్రత పథకం కింద అన్ని ఎంపానెల్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స పూర్తిగా నిలిచిపోనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కొత్త EHCT పథకం అమలుపై ప్రభుత్వం త్వరలో పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
