MLA Yashaswini Reddy Katamayya Raksha Kits
ఆకేరు న్యూస్, పాలకుర్తి: కల్లు గీత కార్మికుల భద్రతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, జనగామ జిల్లా ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని అర్హులైన కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గౌడ సోదరులు తమ వృత్తి నిర్వహణలో ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి చెట్లపైకి ఎక్కి పని చేస్తుంటారని, అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వారి ప్రాణాలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కాటమయ్య రక్ష కిట్లను అందజేస్తోందన్నారు. ఈ రక్ష కిట్లు కార్మికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని వృత్తి వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గౌడ కులస్థుల అభ్యున్నతి కోసం శిక్షణ కార్యక్రమాలు, భద్రతా పరికరాల పంపిణీ, ఉపాధి అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తోందన్నారు. వృత్తి ఆధారిత కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
కల్లు గీత కార్మికులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రక్ష కిట్లను వినియోగించాలని, తమ ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
రక్ష కిట్లు అందుకున్న కల్లు గీత కార్మికులు తమ భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనగామ DBCDO నరసింహారావు, జనగామ జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ అంజి రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు, బ్లాక్ మరియు వివిధ మండలాల అధ్యక్షులు, వివిధ గ్రామల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌడ సంఘం ప్రతినిధులు, కల్లు గీత కార్మికులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గౌడ సోదరులు పాల్గొన్నారు.
