Kommidi Narasimha Reddy Death
* సొంత ఇల్లేలేని ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, భువనగిరి:
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ మట్టి మనిషి కొమ్మిడి నర్సింహారెడ్డి (83) మంగళవారం (జులై 7, 2026) అర్థరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య కారణాలతో నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చేరిన ఆయన.. పరిస్థితి విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మరణంతో యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. రేపు (జులై 8న) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
* తెలంగాణ ఉద్యమకారుడు….
1943 మార్చి 10న యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కొమ్మిడి రాంచంద్రారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు నర్సింహారెడ్డి జన్మించారు. ఆయనకు భార్య సుకన్యమ్మ (రెండు సంవత్సరాల క్రితం మరణించారు), ఇద్దరు కుమారులు (రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి), ఇద్దరు కుమార్తెలు (రజిని రెడ్డి, రాధిక రెడ్డి) ఉన్నారు. పిల్లలను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంచిన నర్సింహారెడ్డి.. తన జీవితాన్ని మొత్తం ప్రజా సేవకే అంకితం చేశారు. 1962 నుంచి 1970 వరకు బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా, 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భువనగిరి తాలూకా పోరాట సమితి కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు.
* రూపాయి పంచలేదు.. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ విజయం..
1978లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సింహారెడ్డి.. నాటి అగ్రనేత, మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీపై 62.75 శాతం ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత 1983లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ప్రభంజనం ఉన్నప్పటికీ.. భువనగిరిలో వరుసగా రెండోసారి కాంగ్రెస్ నుంచే నిలబడి 33.80 శాతం మెజార్టీతో విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచకపోవడం విశేషం. మొత్తం ప్రచార ఖర్చు కేవలం 15 వేల రూపాయలు మాత్రమే కావడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. 1985 మధ్యంతర ఎన్నికల్లో రాజకీయాల్లో డబ్బు, మద్యం ప్రభావం పెరగడాన్ని నిరసిస్తూ ఆయన స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు.
* 300 ఎకరాలు దానం చేసిన భూదాత….
రెండుసార్లు సర్పంచ్‌గా, రెండుసార్లు తాలూకా సమితి ప్రెసిడెంట్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా కొమ్మిడి నర్సింహారెడ్డి పైసా ఆస్తి సంపాదించలేదు. పైగా, తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వందల కోట్ల విలువైన 300 ఎకరాల సొంత భూమిని గ్రామంలోని పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు బజాజ్ చేతక్ స్కూటర్‌పై లేదా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారు. సొంత ఇల్లు కూడా లేకపోవడంతో చివరి రోజుల్లో రామంతాపూర్‌లోని పెద్ద కుమార్తె రజిని రెడ్డి నివాసంలోనే ఆయన గడిపారు.
* గోదావరి జలాల సాధకుడు….
భువనగిరి, ఆలేరు ప్రాంతాల సాగునీటి కోసం ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బ్యారేజీ నిర్మించాలని, ఆ నీటిని మూసీ నదిలోకి మళ్లించాలని బ్లూప్రింట్ గీసి ఇంజనీర్లా వివరించిన ఉద్యమకారుడు ఆయన. మూసీ కాలుష్య నివారణకు ఎన్నో పోరాటాలు చేశారు. 2013లో బీబీనగర్‌లో నిమ్స్ (ప్రస్తుత ఎయిమ్స్) సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్యవాదులు వరవరరావు, గాదె ఇన్నయ్యల అక్రమ అరెస్టులను సైతం బహిరంగంగా ఖండించిన ధీశాలి.
* ఎన్టీఆర్ రమ్మన్నా వెళ్లని ఆత్మగౌరవం…
ఒకానొక సందర్భంలో రాజకీయ చర్చల కోసం వెళ్లినప్పుడు ఎన్టీఆర్ ప్రవర్తించిన తీరు నచ్చక, ఆ తర్వాత ఎన్టీఆర్ స్వయంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినా తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా వెళ్లడానికి నిరాకరించిన నిఖార్సైన నాయకుడు కొమ్మిడి నర్సింహారెడ్డి.
ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా.. ఆయన చేసిన త్యాగాలు, నిస్వార్థ ప్రజాసేవ భవిష్యత్ తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.
