Warangal Road Safety Inspection
* రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లపై సీపీ ప్రత్యేక నజర్
* ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
అకేరు న్యూస్ వరంగల్ :వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం సంబంధిత పోలీసు అధికారులు, నేషనల్ హైవే అథారిటీ, రోడ్డు రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి జాతీయ రహదారి–163పై హనుమకొండ–హైదరాబాద్ ప్రధాన రహదారి మార్గంలో ప్రమాదాలకు గురవుతున్న 10కి పైగా బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలను పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించి, సంబంధిత శాఖలకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రధానంగా జాతీయ రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే అనుసంధాన రహదారులు, డివైడర్ ఓపెనింగ్లు ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించే విధంగా తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద వాహనదారులను అప్రమత్తం చేసే హెచ్చరిక బోర్డులు, దిశా నిర్దేశక సూచికలు, రిఫ్లెక్టివ్ సైన్ బోర్డులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జాతీయ రహదారి వెంట ఉన్న మద్యం దుకాణాల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పార్కింగ్‌ను క్రమబద్ధీకరించేలా సంబంధిత వ్యాపారులు చర్యలు తీసుకునే విధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు చొరవ చూపాలని సూచించారు.
పరిశీలన సందర్భంగా పోలీస్ కమిషనర్ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కరుణాపురం వద్ద పాదచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జ్) నిర్మించాలని స్థానికులు కోరగా, అవసరమైన ప్రదేశాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారి అధికారులకు సూచించారు.
అనంతరం జాతీయ రహదారి–163పై ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన బాధితులను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను పరిశీలించి, అందులో అందుబాటులో ఉన్న అత్యవసర వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సిబ్బంది స్పందన, సేవల నిర్వహణ తీరును అడిగి తెలుసుకుని, మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ఘనపూర్ ఏసీపీ భీంశర్మ, ఎన్. హెచ్.ఏ.ఐ పీడీ భరద్వాజ్ ,మేనేజర్ లింగయ్య, ఇన్స్పెక్టర్లు వేణు, చేరాలు, ఎస్ఐలు నవీన్ కుమార్, శ్రవణ్ కుమార్, ఆర్ఎస్ఐ నవీన్ తో పాటు రోడ్డు రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ, జాతీయ రహదారి అథారిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
