NEET Paper Leak
ఆకేరు న్యూస్, డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఉదంతంపై అర్థరాత్రి వేళ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పేపర్ లీక్ ఘటనను అతిపెద్ద సమస్యగా అభివర్ణించిన ప్రధాని, బాధ్యులెవరినీ వదిలిపెట్టేది లేదని, వారిపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
* ఇవాళ కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు…
ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని ప్రధాని తెలిపారు. ఇవాళ జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో పరీక్షల నిర్వహణ, అక్రమాల అడ్డుకట్టపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దేశంలోనే అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకువస్తామని, అందుకోసం సోమవారం పార్లమెంట్ (సభ)లో కొత్త బిల్లును ప్రవేశపెడతామని ప్రధాని ప్రకటించారు.
* సమగ్ర సంస్కరణలు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు…
దేశంలో ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మోదీ చెప్పారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని ఇప్పటికే గుర్తించి చట్టపరమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఈ కేసును త్వరితగతిన విచారించి, నిందితులకు తగిన శిక్ష పడేలా చేయడానికి ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టు’ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
* రీ-ఎగ్జామ్‌పై స్పష్టత…
విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఎంతో బాధ్యతగా రీ-ఎగ్జామ్ (తిరిగి పరీక్ష) నిర్వహించాం. పునఃపరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు” అని ప్రధాని తన వీడియోలో పేర్కొన్నారు. దేశంలోని యువత, విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని, న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
