Bammera Road Accident Protest by Villagers
* బమ్మెర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
* పాలకుర్తి పోలీస్ స్టేషన్ వద్ద గిరిజన సంఘాల ఆందోళన ఉద్రిక్తత
ఆకేరు న్యూస్ పాలకుర్తి:
పాలకుర్తి మండలం బమ్మెర శివారులో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆందోళనను నింపింది. రోడ్డుపై నిలిపి ఉంచిన బోర్వెల్ లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో నర్సింగపురం తండాకు చెందిన కేతావత్ నరేందర్, బాదావత్ తిరుపతి అనే ఇద్దరు గిరిజన యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదానికి నిర్లక్ష్యంగా రోడ్డుపై లారీని నిలిపి ఉంచిన బోర్వెల్ యజమాని, డ్రైవర్ల వైఖరే కారణమని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు.
* పోలీస్ స్టేషన్ వద్ద బయఠాయింపు – బాధితుల డిమాండ్లు
ప్రమాదం జరిగిన అనంతరం, పోలీసులు బోర్వెల్ యజమానిని పోలీస్ స్టేషన్లో దాచిపెట్టి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని గిరిజన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని బహిరంగంగా చూపించాలని, బాధితుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు.
* నిందితులపై కఠిన చర్యలు..
ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేదా లైట్లు లేకుండా రోడ్డుపై లారీని నిలిపివేసి ఇద్దరి ప్రాణాలు తీసిన బోర్వెల్ యజమాని, డ్రైవర్‌పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన యువకుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, వారి కుటుంబాలకు ప్రభుత్వం మరియు బోర్వెల్ యజమాని నుంచి భారీ పరిహారం అందించాలని పట్టుబట్టారు.
* పోలీసుల తీరుపై నిరసన..
నిందితుడిని రక్షించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి మరియు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపారు.
”ఎవరినీ రక్షించే ప్రసక్తి లేదు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. చట్టప్రకారం కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటాం. నిందితులను తప్పించేందుకు ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు.” — పోలీస్ అధికారులు
పోలీసు ఉన్నతాధికారుల హామీతో పాటు గిరిజన నాయకుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామని చెప్పడంతో ఆందోళన తాత్కాలికంగా శమించింది. అయినప్పటికీ, బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
