KTR gets Rice Bag as gift to telangana bhavan
* ర్యాపిడోలో తెలంగాణ భవన్‌కు సన్నబియ్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ వినూత్న రీతిలో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రచారంలోకి తెస్తూ.. కేటీఆర్‌కు 25 కిలోల సన్నబియ్యం బ్యాగ్‌ను ర్యాపిడో ద్వారా నేరుగా తెలంగాణ భవన్‌కు పంపించారు.
ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ, “దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే” అని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఇంట్లో సన్నబియ్యంతో వంట చేయడం అంటే పండగ వాతావరణం ఉండేదని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందిస్తూ ప్రతిరోజూ పండగలా మార్చారని కొనియాడారు.
కేటీఆర్ జన్మదిన కానుకగా ఈ బియ్యం సంచిని పంపించామని, ఆయనకు అవసరమైతే ప్రతి నెలా కూడా పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాధాన్యతను, పేదలకు అందుతున్న లబ్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
