Minister Konda Surekha at Karimabad Beeranna Bonalu Celebrations
* కరీమాబాద్‌లో వైభవంగా బీరన్న బోనాలు..
ఆకేరు న్యూస్ , వరంగల్ : వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో బీరన్న బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, ప్రారంభమయ్యాయి. సంస్కృతి, సాంప్రదాయాల కలబోతగా సాగిన ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ నగర మాజీ మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బోనాన్ని తలపై ఎత్తుకుని అమ్మవారికి/బీరన్నకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోతురాజుల శివసత్తుల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో కరీమాబాద్ ప్రాంతం మారుమోగింది.
* బీరన్న గుడిపై జాతీయ జెండా రెపరెపలు
బోనాల పండుగ వేడుక కరీమాబాద్‌లోని బీరన్న గుడిలో ప్రత్యేక ఆకర్షణగా జాతీయ జెండా ఉంటుంది. ఉత్సవంలో భాగంగానే జాతీయ జెండాను బోనాల ఊరేగింపుగా తీసుకువచ్చి ఎగుర వేస్తారు. బహుశా ఇలాంటి సంప్రదాయం దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఉండక పోవచ్చు.. నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో పండుగలు కూడా పోరాట రూపాలయినాయి. దేశమంతా స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే ఉంది.. జాతీయ జెండా ఎగురవేస్తే జైల్లు , శిక్షలు ఉండేవి.. ధిక్కార ప్రతీకగా జాతీయ జెండాను వందలాది మంది ఆనాడు ముఖ్యంగా ఆర్య సమాజ్ నేతృత్వంలో ఊరేగింపుగా తెచ్చి ఆవిష్కరించారు.. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
* గావు పట్టారు..
సంప్రదాయబద్ధంగా నిర్వహించే గావు క్రతువు ఈ బీరన్న బోనాల ఉత్సవాల్లో మరో ప్రత్యేక ఆకర్షణ . భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీరన్న స్వామి భక్తులు మరియు పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
———————–
