INSTAGRAM 'RICH KIDS' TRAP ACCUSED ARRESTED
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ‘రిచ్ కిడ్స్ ట్రాప్’ కేసులో ప్రధాన నిందితుడు పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు ఒడిగడుతున్న అతడిని వెస్ట్ జోన్ పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు.
* పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
నిందితుడు పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో లగ్జరీ లైఫ్‌స్టైల్ ఫొటోలు, వీడియోలతో రీల్స్ చేస్తూ సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను ఆకర్షించేవాడు. ప్రేమ పేరుతో వారిని వలలో వేసుకుని, నమ్మించి లైంగిక దాడులకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
* గత 6 నెలల్లో 2 పోక్సో కేసులు..
నిందితుడు పవన్‌పై గత ఆరు నెలల వ్యవధిలోనే ఇద్దరు మైనర్ బాలికలను వేధించినట్లు రెండు పోక్సో (POCSO) కేసులు నమోదయ్యాయి. ఒకే సమయంలో ఐదుగురు యువతులతో సంబంధాలు నెరపుతూ, వారిలో ఒకరిని పెళ్లి పేరుతో దారుణంగా మోసం చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఈ లైంగిక వేధింపుల కేసులతో పాటు నిందితుడిపై చోరీ, స్నాచింగ్ తదితర నేరాల కింద కూడా కేసులు నమోదయ్యాయి.
* ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో చిక్కిన నిందితుడు..
గత మూడు నెలలుగా పోలీసుల కంటికి రెప్పపాటు లేకుండా పరారీలో ఉన్న పవన్, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక తాజా పోస్ట్ అతడి కొంపముంచింది. ఆ పోస్ట్ యొక్క IP అడ్రస్ మరియు లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు పక్కా సమాచారంతో అతడి ఆచూకీని కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు.
బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లల సోషల్ మీడియా ఖాతాలు, వారి స్నేహితుల వివరాలపై తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
