Esha Singh Wins Gold at Hangzhou World Cup
* ఈషా సింగ్ ఘనత
* హాంగ్జౌ వరల్డ్‌కప్‌లో డబుల్ ధమాకా
* మను భాకర్‌కు కాంస్యం
ఆకేరు న్యూస్, డెస్క్: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) రైఫిల్/పిస్టల్/షాట్‌గన్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్లు తమ అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన యువ షూటర్ ఈషా సింగ్ పసిడి పతకాన్ని (స్వర్ణం) కైవసం చేసుకోగా, ఒలింపిక్ పతక విజేత మను భాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఒకే విభాగంలో భారత్‌కు రెండు పతకాలు దక్కడంతో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
* ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం..
ఫైనల్ పోరులో ఈషా సింగ్ ఆరంభం నుంచే అద్భుతమైన నియంత్రణ, ఏకాగ్రతను ప్రదర్శించింది. మొత్తం 50 షాట్లకు గాను 40 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని ముద్దాడింది. చైనాకు చెందిన జుయాంగ్ యుయే 37 పాయింట్లతో వెండి పతకం సాధించగా, ఈషా ఆమెపై 3 పాయింట్ల ఆధిక్యంతో విజయాన్ని ఖాయం చేసుకుంది.
వరల్డ్ కప్ వేదికపై ఒత్తిడిని అధిగమించి మళ్లీ తన పట్టుదలను నిరూపించుకోవడం పట్ల ఈషా సింగ్ సంతోషం వ్యక్తం చేసింది. హాంగ్జౌ రేంజ్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని, గతంలో ఇక్కడే ఆసియా క్రీడల్లో కూడా నాలుగు పతకాలు సాధించానని గుర్తుచేసుకుంది.
* పోరాడి కాంస్యం సాధించిన మను భాకర్..
మరోవైపు, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ హోరాహోరీగా సాగిన ఈ పోటీలో కాంస్య పతకాన్ని సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన షూట్-ఆఫ్‌లో ఉత్తర కొరియాకు చెందిన హ్యోన్ గ్యోంగ్ పాక్‌ను ఓడించి, ఫైనల్లో 28 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్ రౌండ్లో మను భాకర్ 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఈషా సింగ్ 585 పాయింట్లతో రెండో స్థానంలో ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం.
* పతకాల పట్టికలో భారత్..
ఈషా సింగ్ సాధించిన స్వర్ణం, మను భాకర్ గెలుచుకున్న కాంస్యంతో పాటు అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సంయమ్ సాధించిన వెండి పతకంతో భారత్ ఖాతాలో మొత్తం 3 పతకాలు చేరాయి. ఈ విజయంతో భారత్ పతకాల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని అంతర్జాతీయ వేదికపై తన ఆధిపత్యాన్ని మరొకసారి చాటిచెప్పింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
