Rangampet Women Police Station
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రంగంపేట మహిళా పోలీస్ స్టేషన్–2ను వార్షిక తనిఖీల్లో భాగంగా క్రైమ్స్ ఏసీపీ సదయ్య గురువారం సందర్శించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో భాగంగా స్టేషన్లో మహిళల కేసులకు సంబంధించిన రికార్డులు, ఫిర్యాదుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ప్రస్తుత విచారణలో ఉన్న కేసులను ఆయన వివరంగా పరిశీలించారు. నిందితుల అరెస్ట్ ప్రక్రియ మరియు స్టేషన్ నిర్వహణ తీరుపై అధికారులను ఆరా తీశారు.
* బాధితులతో సహానుభూతితో వ్యవహరించాలి..
ఈ సందర్భంగా ఏసీపీ సదయ్య పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. స్టేషన్కు వచ్చే బాధిత మహిళల ఫిర్యాదులను అత్యంత సున్నితంగా, గౌరవప్రదంగా స్వీకరించాలని, తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
బాధిత మహిళలకు భరోసా కల్పిస్తూ, ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా, సహానుభూతితో వ్యవహరించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా, స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ (Update చేస్తూ), పరిసరాల పరిశుభ్రత మరియు క్రమశిక్షణ పాటించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్–2 ఇన్స్పెక్టర్ సువర్ణతో పాటు, ఎస్.ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
