Government Employee Loses ₹23.55 Lakh in Instagram Trading Scam
* లాభాలు ఆశచూపి రూ.23.55 లక్షలు స్వాహా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన ఓ పోస్టు ప్రభుత్వ ఉద్యోగిని నిలువునా ముంచేసింది. అందులోని నంబర్లకు కాల్ చేయడమే అతడు చేసిన పాపమైంది. లైన్లోకి వచ్చిన సైబర్ నేరగాళ్లు ఆ ఉద్యోగిని మాయమాటలతో ఆకట్టుకుని, రెండో సంపాదనగా భారీ లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించి మోసం చేశారు. ఏకంగా రూ.23.55 లక్షలు కాజేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన మొబైల్ చూస్తుండగా ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ పోస్టు అతడిని ఆకర్షించింది. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి.. అనేది అందులోని సారాంశం. పైగా ఆ ప్రకటనలో ఓ కేంద్ర మంత్రి ఫొటో కూడా ఉంది. దీంతో ఆ ఉద్యోగి పోస్టులోని ఓ నంబర్ కు ఫోన్ చేయగానే తనను తాను ఆర్థిక నిపుణుడిగా పేర్కొంటూ ఓ వ్యక్తి లైన్లోకి వచ్చాడు. ట్రేడింగ్ లో తక్కువ మొత్తంలోనే ఎక్కువ లాభాలు పొందవచ్చునని నమ్మించాడు.
* నిజమేనని నమ్మి..
ఆర్థిక నిపుణుడిగా పరిచయమైన ఆ వ్యక్తి చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన ప్రభుత్వ ఉద్యోగి తొలుత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ మొదలుపెట్టాడు. ప్రారంభంలో లాభాలు వచ్చాయి. విత్ డ్రా చేసుకునే అవకాశం కలిగింది. దీంతో అతడికి నమ్మకం పెరగడంతో సోషల్ వెంచర్ క్యాపటలిస్ట్ పేరుతో గల వెబ్సైట్లో చేరాడు. విడతల వారీగా రూ.23.55 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. వెబ్ సైట్ నిర్వాహకులు పలు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకున్నారు. వర్చువల్ గా భారీ లాభాలు వచ్చినట్లు కనిపించడంతో ఆ ఉద్యోగి విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సఫలం కాలేదు. ఆ డబ్బులు తీసుకోవాలంటే 20శాతం కమీషన్ కింద మరో 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పైగా విత్ డ్రా ఆప్షన్ క్లోజ్ చేశారు. దీంతో ఇదంతా సైబర్ మోసమని గుర్తించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
