* హైదరాబాద్‌లో ఈడీ రైడ్స్..
* వైసీపీ నేత విజయప్రసాద్ ఇంట్లో సోదాలు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ :
హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం నుంచీ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Directorate of Enforcement ) అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత, వెల్ఫేర్ గ్రూప్ చైర్మన్ మళ్ల విజయప్రసాద్ ( Welfare Group Chairman ) ఇళ్లు, కార్యాయాల్లో ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోని ఆయనకు సంబంధించిన కార్యాయాలు, ఇళ్లతో పాటు తెలంగాణలోని హైదరాబాద్ లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. బిహార్‌కు చెందిన ఈడీ బృందం సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు జరుపుతున్నారు. రూ.3 వేల కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుపుతున్నారు.
ఏమిటా కుంభకోణం..?
విజయ ప్రసాద్ ( Vijaya Prasad ) 2019లో విశాఖపట్నం పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2021 అప్పటి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2024 నుంచి వైసీపీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయ ప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెల్ఫేర్ గ్రూప్ చైర్మన్‌గా విజయప్రసాద్ ఇంట్లో అవకతవకలకు పాల్పడ్డారని విజయప్రసాద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన కంపెనీస్‌పై పలు క్రిమినల్ కేసులు కూడా నమోదు అయ్యాయి. విశాఖలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అలాగే దువ్వాడ, ద్వారకా, గోపాలపట్నం, టూ టౌన్ పీఎస్‌లలోనూ కేసులు ఫైల్ అయ్యాయి. జనాల నుంచి వివిధ స్కీముల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులను వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. 2007 నుంచి 2018 మధ్య సుమారు రూ.3,041 కోట్లు వెల్ఫేర్ గ్రూప్స్ సమీకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఈరోజు విజయ ప్రసాద్ సహా డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
——————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
