Modi–Pawar Meeting AI generated image
* మోదీ- పవార్ సాన్నిహిత్యం..
* ఇండియా కూటమికి శరద్ పవార్ షాక్ ..!?
* మోదీతో ఎన్ సీపీ (ఎస్పీ ) ఎంపీల భేటీ..
* రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ
* కుటుంబ వేడుకలో మోదీ, షా
* రాజకీయ నిర్ణయానికి ఇదే సంకేతమా.. ?
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి , ముంబయి : రాజకీయాల్లో కొన్ని భేటీలు సాధారణమే. కొన్ని భేటీలు మాత్రం వాటి వెనుక ఉన్న సమయం, సందర్భం కారణంగా రాజకీయ సంకేతాలుగా మారిపోతాయి.NCP (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల పెరుగుతున్న సమావేశాలు ఇప్పుడు అలాంటి చర్చకే దారితీశాయి. ఆగస్టు 10న ఢిల్లీలో ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా వివిధ పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందువల్ల మోదీ, షా హాజరును మాత్రమే రాజకీయ పొత్తుకు ఆధారంగా చూడటం సరికాదు.
కానీ అదే రోజు శరద్ పవార్ నేతృత్వంలోని NCP(SP)కు చెందిన ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు ప్రధానమంత్రి మోదీని కలవడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా డీలిమిటేషన్‌పై పార్లమెంటులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలో జరిగిన ఈ సమావేశం అనేక ఊహాగానాలకు తెరతీసింది.
* డీలిమిటేషన్ దగ్గరే అసలు రాజకీయం?
శరద్ పవార్ ఎన్ డీఏ ( NDA) లో చేరతారని ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. NCP(SP) కూడా అలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.అయితే ప్రస్తుతం కీలకమైన ప్రశ్న అది కాదు.డీలిమిటేషన్ విషయంలో శరద్ పవార్ ఎటువైపు నిలుస్తారు..?ఇదే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశం.కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న డీలిమిటేషన్‌కు సంబంధించిన మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇందులో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులు కూడా ఉన్నాయి. ప్రతిపాదనల్లో లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 550 నుంచి 850 వరకు పెంచే అవకాశం, నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వంటి అత్యంత కీలకమైన అంశాలు ఉన్నాయి. అందుకే ఇది కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మార్చే ప్రక్రియ కాదు. భవిష్యత్ భారత రాజకీయ అధికార సమీకరణాలను మార్చగల అంశం.
* బిల్లు విషయంలో ప్రతిపక్షంలో ఏకాభిప్రాయం ఉందా..?
డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా వ్యూహాత్మక భేదాలు కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టకూడదని కోరుతోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల పరిధిలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రతిపక్షం వాదిస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ అంశంపై కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినప్పటికీ స్పష్టమైన మద్దతు లభించలేదు. ఇలాంటి సమయంలో ఎన్ సీపీ NCP(SP) ఎంపీలంతా మోదీని కలవడం సహజంగానే రాజకీయ ఆసక్తిని పెంచింది.
* పవార్ పార్టీ ఎంపీల్లో అసంతృప్తి ఉందా?
ఈ చర్చకు మరో కారణం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు.శరద్ పవార్ పార్టీకి చెందిన ఐదారుగురు ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారని చవాన్ జూలైలో పేర్కొన్నారు. అంతేకాదు, ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో జరిగిన పరిణామాల మాదిరిగానే పవార్ పార్టీ విషయంలోనూ జరగవచ్చని ఆయన ఆరోపించారు. మోదీ – అమిత్ షా నాయకత్వం ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని చవాన్ అంటున్నారు. ఎన్ సీపీ ( NCP-SP) నాయకత్వం ఈ వాదనను తిరస్కరించింది. తమ ఎనిమిది మంది ఎంపీలు, పది మంది ఎమ్మెల్యేలు కలిసే ఉన్నారని పార్టీ నేత జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. అందువల్ల NCP(SP) ఎంపీలు ఎన్ డీఏ NDA వైపు వెళ్తున్నారని ప్రస్తుతం నిర్ధారితంగా చెప్పడానికి ఆధారాలు లేవు.
* అజిత్ పవార్ మరణంతో మారిన సమీకరణాలు
ఎన్ సీపీ ( NCP) లో ఇప్పటికే ఒక భారీ చీలిక జరిగింది. అజిత్ పవార్ వర్గం శరద్ పవార్ నుంచి విడిపోయి BJP నేతృత్వంలోని కూటమిలో చేరింది. 2026 జనవరిలో రెండు NCP వర్గాలు కొన్ని స్థానిక ఎన్నికల్లో దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడంతో తిరిగి విలీనం జరుగుతుందా అనే చర్చ కూడా మొదలైంది. కానీ జనవరి 28న అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు మరోసారి మారిపోయాయి. అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్ సీపీ ( NCP ) రాజకీయ వారసత్వం, రెండు వర్గాల భవిష్యత్తు, పవార్ కుటుంబంలోని రాజకీయ సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
* కుటుంబం ఒక్కటవుతోంది.. పార్టీ కూడా ఒక్కటవుతుందా..?
పవార్ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో రెండు వర్గాలకు చెందిన నేతలు కలిసి కనిపించడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.తాజాగా సుప్రియా సూలే కుమార్తె వివాహ వేడుకలోనూ పవార్ కుటుంబంతో ప్రధాని మోదీ, అమిత్ షా సన్నిహితంగా మెలగడం రాజకీయ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.ప్రత్యర్థులతో వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తూనే, అవసరమైన సందర్భాల్లో ఊహించని రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం పవార్ రాజకీయ జీవితంలో కొత్త విషయం కాదు.
అందువల్ల ప్రస్తుతం శరద్ పవార్ NDAలో చేరతారా? అనే స్థాయిలో చూడటం కంటే, డీలిమిటేషన్‌పై కీలక ఓటింగ్ వస్తే NCP(SP) ఏ వైఖరి తీసుకుంటుంది..? అనే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యాబలం సమీకరించాల్సిన పరిస్థితి వస్తే చిన్న, మధ్యస్థ పార్టీల మద్దతు కూడా కీలకంగా మారుతుంది.
* ఇండియా కూటమికి అసలు పరీక్ష అక్కడే
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్ర రాజకీయ ఆందోళన ఉంది. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు లోక్‌సభ ప్రాతినిధ్యంలో నష్టం జరగకూడదన్నది ప్రధాన వాదన. మరోవైపు జనాభా ఆధారంగా సమాన ప్రాతినిధ్యం ఉండాలన్న రాజ్యాంగ సూత్రాన్ని కేంద్రం ముందుకు తెస్తోంది. 1976లో విధించిన సీట్ల ఫ్రీజ్ను 2001లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 తర్వాత జరిగే తొలి జనగణన వరకు పొడిగించారు. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న చర్చ భారత సమాఖ్య వ్యవస్థలోనే అత్యంత కీలకమైన రాజకీయ అంశంగా మారింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకపోవచ్చు. ఎన్ సీపీ NCP(SP) ప్రతిపక్షంతోనే నిలబడుతుందా? డీలిమిటేషన్లో కేంద్రానికి షరతులతో కూడిన మద్దతు ఇస్తుందా అన్న అంశానికి త్వరలోనే జవాబు దొరికే అవకాశం ఉంది.
——————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
