Chhattisgarh proxy councillor ban, ai generated image
* ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
* మహిళా కౌన్సిలర్ల స్థానంలో భర్తలు, బంధువులు ‘ప్రాక్సీ’లుగా వ్యవహరించడంపై నిషేధం
* మహిళా రిజర్వేషన్ లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నారని ప్రభుత్వం స్పష్టీకరణ
ఆకేరు న్యూస్, రాయ్‌పూర్ ( చత్తీష్‌గడ్ ) :
ఎన్నికల్లో గెలిచేది మహిళలు.. అధికారాన్ని చెలాయించేది భర్తలు.. స్థానిక సంస్థల్లో చాలాకాలంగా కనిపిస్తున్న ఈ ‘ప్రాక్సీ పాలన’కు అడ్డుకట్ట వేసేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు లేదా ఇతర కుటుంబ సభ్యులు ప్రతినిధులుగా వ్యవహరించే విధానాన్ని నియంత్రిస్తూ స్పష్టమైన నిబంధన తీసుకొచ్చింది.
ఆగస్టు 6న ఛత్తీస్‌గఢ్ పట్టణ పరిపాలన, అభివృద్ధి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 2022 నిబంధనలను సవరించింది.దీని ప్రకారం ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధికి చెందిన భర్త, కుమారుడు, కుమార్తె, సోదరుడు, సోదరి లేదా ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులు, బంధువులను ఆమె తరఫున ప్రాక్సీ ప్రతినిధిగా లేదా కోఆర్డినేటింగ్ పర్సన్‌గా నామినేట్ చేయడం, నియమించడం నిషేధం.ఈ సవరణను రూల్–4గా చేర్చి ఛత్తీస్‌గఢ్ గెజిట్‌లో ప్రచురించారు.
* ‘పార్షద్ పతి’ సంస్కృతికి చెక్
పట్టణ స్థానిక సంస్థల్లో ఈ విధానాన్ని వ్యంగ్యంగా ‘పార్షద్ పతి’, గ్రామీణ ప్రాంతాల్లో ‘సర్పంచ్ పతి’ అని పిలుస్తుంటారు.ఎన్నికల్లో మహిళ గెలిచినా.. సమావేశాలకు భర్త హాజరవడం, అధికారులతో భర్త మాట్లాడటం, నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో మహిళా ప్రజాప్రతినిధి స్థానంలో కుటుంబ సభ్యులే వ్యవహరించడం వంటి ఫిర్యాదులు చాలాకాలంగా వస్తున్నాయి.
ఈ సమస్యపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2010లోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మహిళా ప్రజాప్రతినిధుల విధుల్లో వారి బంధువుల జోక్యంపై ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి.
* రాష్ట్రవ్యాప్తంగా వివరాలు కోరిన ప్రభుత్వం
ఈ ఏడాది ఈ వ్యవహారంపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది.ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టణ స్థానిక సంస్థల్లో ఎవరెవరిని తమ ప్రతినిధులుగా నియమించారో, వారిలో మహిళా మేయర్లు, అధ్యక్షులు, చైర్పర్సన్లు, కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఉన్నారా అనే వివరాలను పట్టణ పరిపాలన శాఖ కోరింది.అయితే ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఇలాంటి ప్రతినిధులు ఉన్నట్లు గుర్తించారనే సమగ్ర గణాంకాలను ప్రభుత్వం ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు.
* 50 శాతం సీట్లు మహిళలకే..
స్థానిక సంస్థల్లో మహిళలకు గణనీయమైన ప్రాతినిధ్యం ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో తాజా నిర్ణయానికి మరింత ప్రాధాన్యం ఉంది.ఛత్తీస్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ చేసే స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఉంది.
2025లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా 173 పట్టణ స్థానిక సంస్థలు, 3,206 వార్డుల్లో జరిగాయి. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నప్పుడు వారి స్థానంలో కుటుంబ సభ్యులు అధికారాన్ని చెలాయిస్తే మహిళా రిజర్వేషన్ అసలు లక్ష్యమే దెబ్బతింటుందన్నది ప్రభుత్వ వాదన.
*మహిళ గెలిస్తే.. అధికారాన్ని బంధువులు చెలాయించకూడదు
ఉప ముఖ్యమంత్రి, పట్టణ పరిపాలన శాఖ మంత్రి అరుణ్ సావో ఈ నిర్ణయానికి కారణాలను వెల్లడించారు. ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు, ఇతర కుటుంబ సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారంటూ ప్రభుత్వానికి పదేపదే ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. నకిలీ సంతకాలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు.మహిళల కోసం స్థానాలను రిజర్వ్ చేసి, ఎన్నికైన తర్వాత వారి బాధ్యతలను కుటుంబ సభ్యులు నిర్వహించడానికి అనుమతిస్తే మహిళా రిజర్వేషన్ ఉద్దేశమే దెబ్బతింటుందని ఆయన స్పష్టం చేశారు.కొత్త నిబంధనలకు విరుద్ధంగా జరిగే నియామకాలు చెల్లవని, అవసరమైతే చర్యలు తీసుకోవచ్చని కూడా ప్రభుత్వం చెబుతోంది.
* రాయ్‌పూర్ సమావేశంలో ఇద్దరు ‘కౌన్సిలర్ పతులు’
ఇటీవల రాయ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఓ సమావేశం ఈ సమస్యను మరోసారి చర్చలోకి తెచ్చింది. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సలహా కమిటీ సమావేశానికి ఇద్దరు మహిళా కౌన్సిలర్ల భర్తలు హాజరయ్యారు. బీజేపీ కౌన్సిలర్ సాధనా సాహు భర్త ప్రమోద్ సాహు, కాంగ్రెస్ కౌన్సిలర్ రేణు సాహు భర్త జయంత్ సాహు ఆ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ సమావేశం ఆగస్టు 6 నాటి కొత్త నోటిఫికేషన్‌కు ముందే జరిగింది.** అందువల్ల వారి హాజరును కొత్త నిబంధన ఉల్లంఘనగా పరిగణించడం సరికాదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు నియంత్రించాలని భావిస్తున్న ‘ప్రాక్సీ ప్రాతినిధ్యం’పై చర్చకు ఇది తాజా ఉదాహరణగా నిలిచింది.
* భార్యల బదులు భర్తలే ప్రమాణం!
‘ప్రాక్సీ’ వ్యవహారం ఛత్తీస్‌గఢ్ పట్టణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. 2025 మార్చిలో కబీర్ధామ్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఆరుగురు మహిళా పంచాయతీ ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారం చేసినట్లు వార్తలు రావడంతో అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది.అయితే అది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన ఘటన. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త నిబంధన పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించినది. కాబట్టి రెండింటినీ ఒకే చట్టపరమైన పరిధిలో చూడకూడదు.
* బీజేపీ స్వాగతం.. కాంగ్రెస్ సందేహం
బీజేపీ మహిళా మోర్చా తాజా సవరణను స్వాగతించింది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు విభా అవస్థి మాట్లాడుతూ మహిళా ప్రజాప్రతినిధులే స్వయంగా సమావేశాలకు హాజరై, తమ వార్డుల్లోని సమస్యలను అర్థం చేసుకొని, సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ సుశీల్ ఆనంద్ శుక్లా మాత్రం ప్రభుత్వ ఉత్తర్వుతో క్షేత్రస్థాయిలో పరిస్థితి నిజంగా మారుతుందా అని ప్రశ్నించారు.
* బంధువులపై పూర్తిస్థాయి నిషేధం కాదు
కొత్త నిబంధన విషయంలో మరో ముఖ్యమైన అంశం ఉంది. మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు వారితో కలిసి బయటకు రావడం లేదా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ఈ నోటిఫికేషన్ పూర్తిగా నిషేధించడం లేదు.మహిళా ప్రజాప్రతినిధి స్థానంలో అధికారికంగా ‘ప్రాక్సీ ప్రతినిధి’ లేదా ‘కోఆర్డినేటింగ్ పర్సన్’గా సన్నిహిత బంధువులను నియమించడం, నామినేట్ చేయడంపైనే నిషేధం విధించింది.
* నిబంధన వచ్చింది.. అమలే అసలు పరీక్ష
ఏళ్ల తరబడి ఫిర్యాదులు, ఆదేశాల తర్వాత ‘పార్షద్ పతి’ తరహా ప్రాక్సీ వ్యవస్థపై చర్యలు తీసుకునేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇప్పుడు స్పష్టమైన నిబంధనను తీసుకొచ్చింది.
అయితే చట్టంలో నిబంధన పెట్టడం ఒక ఎత్తయితే.. క్షేత్రస్థాయిలో దానిని అమలు చేయడం మరో ఎత్తు.
ఎన్నికల్లో మహిళకు వచ్చిన ప్రజాతీర్పు.. పాలనలో ఆమె భర్తకు బదిలీ కాకుండా చూడగలిగితేనే ఈ నిర్ణయం అసలు లక్ష్యం నెరవేరుతుంది.
—————————————————————–


Please tell us what is wrong. Your report will be sent to the website team.
