Irrigation Water Release
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని రిజర్వాయర్ మెయిన్ కెనాల్ ద్వారా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం పంట కాలువలకు నీరు విడుదల చేశారు. ఈ సందర్బంగా రిజర్వాయర్ వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రిజర్వాయర్ల నుండి ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో సాగు నీటి విడుదల జరుగుతుందని అన్నారు. 15 రోజులు నిరంతరాయంగా నీటి విడుదల చేసి మరో 15 రోజులు రిజర్వాయర్లలో నీటి నింపి మళ్ళీ 15రోజులు నీటి విడుదల జరుగుతుందని చెప్పారు. రైతులు కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకొని పొదుపుగా వాడుకుంటూ పంటలను కాపాడుకోవాలని సూచించారు. స్టేషన్ ఘన్ పూర్ మెయిన్ కెనాల్ ద్వారా పాలకుర్తి, వర్ధన్నపేట, జనగామ నియోజకవర్గాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో 58 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు చేరే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మేము నీటి విడుదల చేసాము ఇక సాయంత్రానికి ఒక బ్యాచ్ దిగుతుందని ఇక వారే నీళ్లు తెచ్చామని, మేము చేయబట్టే నీరు వచ్చిందని మీడియా ముందుకు వచ్చి భజన చేస్తారని ఆరోపించారు. ప్రజలు, రైతులు అలాంటి వారి పగటి వేషాలను గమనించాలని అన్నారు. ప్రతిపక్షాలు చిల్లర వేషాలు పక్కన పెట్టి గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
* ఈసిజీ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
స్థానిక ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈసిజీ మిషన్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా స్వయంగా ఎమ్మెల్యే ఈసిజీ టెస్ట్ చేయించుకున్నారు. ఏరియా ఆసుపత్రిలో ఈసిజీ టెస్ట్ అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా మంజూరు కాబోతుందని తెలిపారు. అలాగే పూర్తి స్థాయిలో సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో 46 కోట్లతో నిర్మాణం అవుతున్న 100 పడకల ఆసుపత్రిని 31 డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేసి జనవరి 2027 నాటికి అన్ని వసతులతో కూడిన 100 పడకల ఆసుపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్యం అందుబాటులోకి తేవడమే ఏకైక లక్ష్యాంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
