Narsampet Political Tension
* ఎమ్మెల్యే దొంతి దిష్టిబొమ్మ దగ్ధం
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు అర్ధరాత్రి సమయంలో తొలగించడంతో తీవ్ర దుమారం రేగింది.
నర్సంపేటలోని మెడికల్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని భారీ పోలీస్ బందోబస్తు మధ్య తొలగించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
* అర్ధరాత్రి హైడ్రామా – కట్టుదిట్టమైన ఆంక్షలు…
విగ్రహ తొలగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ పరిణామంపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు కట్టడి చేశారు.
జిల్లావ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
* ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..
ఈ ఘటనకు నిరసనగా జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దుగ్గొండి మండలం కేంద్రంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో బీఆర్ఎస్ నాయకులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రైవేటు స్థలంలో నిబంధనల ప్రకారమే విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అక్రమంగా తొలగించారని నాయకులు ఆరోపించారు.
* పరిస్థితి సమీక్షిస్తున్న పోలీసులు
నర్సంపేట నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనపు బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
