MLC Pochampally Srinivas Reddy
* కాంగ్రెస్ సర్కార్‌పై ఎమ్మెల్సీ పోచంపల్లి ఫైర్
ఆకేరు న్యూస్, వరంగల్:
నర్సంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో అధికారులు తొలగించడాన్ని బీఆర్ఎస్ శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో చేస్తున్న ఇలాంటి దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసిస్తున్నామని స్పష్టం చేశారు.
* ప్రైవేట్ స్థలంలో విగ్రహం పెడితే మీకేంటి అభ్యంతరం…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన మహనీయుడిని గౌరవించుకోవడం మాని, కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే అవమానపరుస్తోందని మండిపడ్డారు. అన్ని అనుమతులతో ఒక ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అర్ధరాత్రి పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని తొలగించడం కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.
* అధికార బలంతో విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకోం..
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి వీడాలని సూచించారు. “అధికార బలంతో మీరు ఒక్క విగ్రహాన్ని తొలగిస్తే.. రాబోయే రోజుల్లో నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాలను ప్రతిష్టిస్తాం” అని పోచంపల్లి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని, అరెస్టు చేసిన కార్యకర్తలను, నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
