Konda Sushmitha Patel Parakala
* సీఎం రేవంత్ కి కొండా సుస్మితా పటేల్ ఓపెన్ ఛాలెంజ్
* కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లక్ష్యంగా కొండా మురళీ, మంత్రి కొండా సురేఖల కుమార్తె కొండా సుస్మితా పటేల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గీసుకొండ మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
* సీఎం మాట తప్పారు..
ఈ సందర్భంగా కొండా సుస్మితా పటేల్ మాట్లాడుతూ.. కష్టకాలంలో గీసుకొండ ప్రజలు కొండా కుటుంబానికి కొండంత అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. “రేవంత్ రెడ్డి టిపిసిసి (TPCC) అధ్యక్షుడు కావాలని మొదట కోరుకున్నది కొండా మురళీ, కొండా సురేఖలే. ఆయనను సీసీపి అధ్యక్షుడిని చేయడానికి ఎంతో కృషి చేశారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ (MLC) ఇస్తానని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. ఆ మాట ఇచ్చారో లేదో ఆయన ప్రమాణం చేసి చెప్పాలి” అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి ఇంకా కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదని, సీఎం అయ్యాక ఆయనకు కళ్లు నెత్తికెక్కాయని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.
* అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ వాతావరణం ప్రస్తుతం “అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్”గా మారిపోయిందని సుస్మితా ఆరోపించారు. TDP నుంచి వచ్చిన నాయకులంటేనే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. “ఏఐసీసీ (AICC) అధిష్టానం అంటే మాకు చాలా గౌరవం, ఇష్టం ఉంది. అధిష్టానమే టికెట్లు ఇస్తుందనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. సీఎం పక్కన ఉన్న ఒక పొంగు ఎక్కువసేపు పొంగదు. వేం నరేందర్ రెడ్డి సీఎంకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో అందరికీ తెలుసు. సీఎం, ఆయన తమ్ముడు కలిసి దోచుకుంటున్నారు” అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బీసీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తమ వద్దకు వచ్చి కొందరు ఆవేదన వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు.
* రేవూరి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు..
పరుకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై కూడా కొండా సుస్మితా విరుచుకుపడ్డారు. ఎలక్షన్లకు ముందు పరకాల ప్రజలకు రేవూరి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. వృద్ధుడైన రేవూరికి మళ్లీ టికెట్ ఇస్తానని సీఎం రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డితో తక్షణమే రాజీనామా చేయించాలని సీఎంకు డిమాండ్ చేశారు. రెండేళ్ల వరకు ఆగాల్సిన అవసరం లేదని, ఇప్పుడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. కొండ ఇలాకాలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
* పరకాల నుంచే పోటీ.. త్వరలోనే ఇల్లు నిర్మాణం..
పరకాల నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు త్వరలోనే ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నట్లు సుస్మితా పటేల్ ప్రకటించారు. “కొండా మురళీ, సురేఖ మంచోళ్లు కాబట్టి సీఎం గురించి బయటకు మాట్లాడలేదు. కానీ ‘చిట్టక్క’ (సుస్మిత) అన్ని విషయాలు మాట్లాడుతుంది. రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిలతో పాటు వాళ్ల తాతలు వచ్చినా సరే పరకాల నుంచి నేనే నిలబడి గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తీరుతాను” అని తేల్చి చెప్పారు.
కొండా సుస్మితా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా, తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
