Ravi Teja Irumudi Movie
* కొత్త రవితేజను చూస్తారు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, యాక్షన్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్. అయితే, ఈసారి ఆయన రూట్ మార్చి పూర్తి భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా, దర్శకుడు శివ నిర్వాణ మీడియాతో ప్రత్యేకంగా చిట్ చాట్ నిర్వహించారు. సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఇవే..
* రామ్ చరణ్ కామియోపై క్లారిటీ..
సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ‘ఇరుముడి’లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తారని గట్టి ప్రచారం జరుగుతోంది. దీనిపై శివ నిర్వాణ స్పందిస్తూ, “లేదండి, అది కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే. అందులో నిజం లేదు. రామ్ చరణ్ గారు అయ్యప్ప భక్తులు, బహుశా అందుకే అభిమానులు అలా కోరుకుని ఉంటారు. కానీ, చరణ్ గారు ఈ సినిమాలో నటించలేదు. అయితే, ఈ సినిమా ఆయనకు నచ్చాలని నేను కోరుకుంటున్నాను,” అని తేల్చి చెప్పారు.
* ‘ఇరుముడి’లో మూడు లేయర్స్..
టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, వాటిని సినిమా ఖచ్చితంగా అందుకుంటుందని శివ ధీమా వ్యక్తం చేశారు. “ఈ సినిమాలో మూడు ముఖ్యమైన లేయర్స్ ఉంటాయి. అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, ఫ్యామిలీ ఎమోషన్స్, మరియు క్రైమ్ యాంగిల్. ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు సినిమా కంటెంట్‌పై స్పష్టత వచ్చింది. వారు దేని కోసం థియేటర్‌కు రావాలో ప్రిపేర్ అయ్యారు,” అని తెలిపారు.
* కొత్త రవితేజను చూస్తారు..
రవితేజను కొత్తగా చూపించడంపై మాట్లాడుతూ.. “రవితేజ లాంటి స్టార్ హీరోతో ఎవరూ టచ్ చేయని పాయింట్ చెప్తే దాని రీచ్ వేరేలా ఉంటుంది. అయ్యప్ప మాల నేపథ్యం, కొత్త సెటప్‌తో కూడిన ఈ కథ రవితేజ గారి గడ్డం, తేజస్సుకి అద్భుతంగా సరిపోయాయి. ప్రేక్షకులు ఇందులో కొత్త రవితేజను చూస్తారు,” అన్నారు. దర్శకుడిగా తనకు రవితేజ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కొనియాడారు.
* ‘మాలికాపురం’తో పోలికలపై స్పందన..
ఫస్ట్ లుక్ తర్వాత మలయాళ చిత్రం ‘మాలికాపురం’తో వచ్చిన పోలికలపై శివ నిర్వాణ స్పందించారు. “సౌత్‌లో అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. రవితేజ లాంటి స్టార్‌తో ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. తక్కువ సినిమాలు ఉన్నాయి కాబట్టి పోలిక సహజం. కానీ, ట్రైలర్ చూశాక ఇది చాలా యూనిక్ ఫిలిం అని ప్రేక్షకులే అంటున్నారు. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు,” అని స్పష్టం చేశారు.
* సినిమా కోసం మాల ధరించిన దర్శకుడు..
ఈ కథ కోసం శివ నిర్వాణ చాలా హోంవర్క్ చేశారు. “కథ అనుకున్నాక అయ్యప్ప మాల గురించి చాలామందిని అడిగి తెలుసుకున్నాను. కానీ ఏదో అసంతృప్తి. అందుకే నేనే స్వయంగా మాల వేశాను. పడిపూజలకు వెళ్లాను, గురుస్వాములను కలిశాను. గతంలో శబరిమల కూడా వెళ్లాను. అందుకే ఇందులో మంగళహారతులు, భజనలు, నిష్ట అన్నీ చాలా ప్రామాణికంగా ఉంటాయి,” అని వివరించారు. సాయికుమార్ గురుస్వామి పాత్రలో అద్భుతంగా నటించారని చెప్పారు.
* ‘మల్లెపూల పల్లకి’ పాట వెనుక కథ..
ఈ చిత్రంలోని ‘మల్లెపూల పల్లకి’ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై శివ మాట్లాడుతూ.. “ఇది అయ్యప్ప భక్తులు 15 ఏళ్లుగా పడిపూజల్లో పాడుకునే పాట. సీలేరు ప్రాంతంలోని ఒక స్వామిని అడిగి ఈ పాట గురించి తెలుసుకున్నాం. పెద్ద సింగర్స్ ఉన్నా, వారి మనోభావాలను గౌరవిస్తూ ఒరిజినల్‌గా పాడిన 60 ఏళ్ల డప్పు శ్రీను గారి చేతనే పాడించాం. థియేటర్లో ఈ పాట పూనకాలు తెప్పిస్తుంది,” అని చెప్పారు.
* యూనిక్ లొకేషన్స్ – సీలేరు అడవులు..
సినిమాను చాలా రూరల్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. “సాధారణంగా కేరళలో షూట్ చేసి ఆంధ్రాకి మ్యాచ్ చేస్తారు. కానీ మేము సుకుమార్ గారు ‘రంగస్థలం’ తీసిన మారేడుమిల్లి దాటి, మరో రెండు గంటలు ప్రయాణించి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్లోని సీలేరు ప్రాంతానికి వెళ్లాం. ఎటు చూసినా కొండలు, అడవులతో విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. డీఓపీ విష్ణు శర్మ మంచి విజువల్స్ ఇచ్చారు,” అని తెలిపారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర ‘మనెమ్మ’ పాత్రకు పర్ఫెక్ట్గా సరిపోయిందని అన్నారు.
* టైటిల్ జస్టిఫికేషన్..
తండ్రి-కూతురు బంధం, అయ్యప్ప భక్తుడు-మాల, క్రైమ్ ఎలిమెంట్.. ఈ మూడు ముళ్లను కలిపి ‘ఇరుముడి’ అని టైటిల్ పెట్టినట్లు శివ నిర్వాణ వివరించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి గారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సీలేరు లాంటి ప్రాంతంలో 250 మందితో షూటింగ్ చేయగలిగామని కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
