Errabelli Dayakar Rao Demands Irrigation Water
* సాగునీరందించి రైతులను తక్షణమే ఆదుకోవాలి – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్
* బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆకేరు న్యూస్, దేవురుప్పల:
ఎండిపోతున్న పంటలకు తక్షణమే సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ జాతీయ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసన బాట పట్టారు. జనగామ జిల్లా దేవురుప్పల మండలం మరిపడగ బంజారా కెనాల్ కాలువ వద్ద ఆయన గురువారం పాదయాత్ర నిర్వహించారు. సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని ఆయన పట్టుబట్టారు.
* ప్రభుత్వ వైఖరిపై మండిపాటు..
ఈ సందర్భంగా దేవురుప్పల మండలం మరిపడగ బంజారా కెనాల్ పరిధిలోని ఎండిపోయిన పంట పొలాలను, కాలువను పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారుల నిర్లక్ష్యం మరియు ప్రభుత్వ అసమర్థతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కష్టపడి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉందన్నారు. నీటి నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీరు చేర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
* పోలీసుల ముందస్తు అరెస్టులు..
పాదయాత్ర అనంతరం ఆందోళనకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులను దేవురుప్పల ఎస్ఐ సృజన్ కుమార్ నేతృత్వంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
* రైతులకు మద్దతుగా పోరాటం..
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. బంజారా కెనాల్లోకి తక్షణమే సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల పొలాలకు నీళ్లు అందే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
