Minister Ponnam Prabhakar, Telangana Auto Drivers Welfare
* ఛార్జీల పెంపుతో పాటు భారీ నజరానా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి స్పష్టం చేశారు. సచివాలయంలో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రులు మరియు ఉన్నతాధికారులు సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని సమీక్షించడంతో పాటు, ఆటో రంగానికి సంబంధించి ప్రభుత్వం తరఫున పలు విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించారు.
* త్వరలోనే ఆటో ఛార్జీల పెంపు అమలు
2012 తర్వాత రాష్ట్రంలో ఆటో ఛార్జీలను పెంచకపోవడాన్ని ప్రభుత్వం గుర్తింస్తుందని, ప్రస్తుత నిత్యావసరాలు, ఇంధన ధరల పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను పెంచేందుకు సానుకూలంగా ఉందన్నారు. దీనికోసం రవాణా శాఖ అధికారులు, ఆటో సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, వారిచ్చే సమగ్ర నివేదిక ఆధారంగా త్వరలోనే ఛార్జీల పెంపును అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
* ఆర్టీసీ ఈవీ ఆటోల ప్రచారంపై స్పష్టత
టీజీఎస్ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను నడిపి లాస్ట్ మైల్ కనెక్టివిటీ తీసుకువస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పాలసీ పేరుతో ఆర్టీసీ ఈవీ ఆటోలను నడిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
* శాసనసభలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు బిల్లు
ఆటో కార్మికుల సుదీర్ఘకాల స్వప్నమైన సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు. కార్మిక శాఖతో కలిసి ఈ అంశాన్ని త్వరలోనే కేబినెట్ సమావేశంలో చర్చించి, రాబోయే శాసనసభ సమావేశాల్లో విధిగా బిల్లు ప్రవేశపెడతామన్నారు.
* ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓలా, ఉబర్ తరహా ప్రత్యేక యాప్
ప్రైవేట్ అగ్రిగేటర్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, ఆటో డ్రైవర్ల ప్రయోజనాల కోసం ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వమే స్వయంగా ఒక ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిపై ఐటీ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
* ఆటోల రెట్రోఫిట్మెంట్ కోసం రూ. 1.50 లక్షల సాయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్, పెట్రోల్ ఆటోలను రెట్రోఫిట్మెంట్ (ఈవీగా మార్పు) చేసుకునేందుకు నగరంలోని సుమారు 18,700 ఆటోలకు ఒక్కో దానికి రూ. 1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నామని తెలిపారు. దీనికోసం వివిధ శాఖల సమన్వయంతో రూ. 200 కోట్ల నిధులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
* పర్మిట్ల పునరుద్ధరణ, కఠిన నిబంధనలు
రవాణా రంగానికి సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారంలో భాగంగా జీఓ ఎంఎస్ నం.263 కింద నిలిచిపోయిన, గడువు ముగిసిన పర్మిట్ల కోటాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఇతర జిల్లాల ఆటోలు హైదరాబాద్ నగరంలోకి అక్రమంగా రాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
* ఇందిరమ్మ బీమా పాలసీ, సారథి పోర్టల్ సమస్యల పరిష్కారం
సారథి పోర్టల్లోని ఎల్ఎంవీ లైసెన్స్ సమస్యపై స్పష్టత కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామని తెలిపారు. అలాగే, ఆటో డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేందుకు ‘ఇందిరమ్మ పాలసీ’ కింద ప్రత్యేక ప్రమాద, సహజ మరణ బీమా సౌకర్యాన్ని కార్మిక శాఖ ద్వారా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందనలతో పాటు ఉన్నతాధికారులు, వివిధ ఆటో సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
