Addanki police issue notices to YouTuber Ramanandana
* యూట్యూబర్ రమానందనకు మరోసారి నోటీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలిగా ఉన్న ప్రముఖ యూట్యూబర్ రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
* కేసు పూర్తి వివరాలు..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, యునైటెడ్ కింగ్డమ్ (UK) లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన కన్సల్టెన్సీ నిర్వాహకులు, ఒక బాధితుడి కుటుంబం నుండి 2023లో విడతల వారీగా భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. తొలుత రూ. 1 లక్ష చెల్లించిన బాధితులు, ఆ తర్వాత రూ. 9.60 లక్షల వరకు సమర్పించారు. మొత్తం రూ. 10.60 లక్షలు చెల్లించినప్పటికీ, హామీ ఇచ్చిన ప్రకారం ఉద్యోగం ఇప్పించకపోగా, చెల్లించిన సొమ్మును కూడా తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూన్ నెలలో కేసు నమోదు కాగా, కేసు దర్యాప్తులో భాగంగా యూట్యూబర్ రమానందనతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదయ్యాయి.
* రియాల్టీ షో కి వచ్చి..
ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఎంపికల (Auditions) నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన యూట్యూబర్ రమానందన సమాచారం అందుకున్న అద్దంకి పోలీసులు, ఆమెకు శుక్రవారం ముందస్తు నోటీసులు అందజేశారు. పోలీసుల నోటీసుల మేరకు రమానందన తన న్యాయవాదితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి నోటీసులను స్వీకరించారు. ఈ వ్యవహారంలో తదుపరి చట్టపరమైన విచారణ వేగవంతం చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
