Danam Nagender, Telangana Assembly
* దానం కీలక ప్రతిపాదనలు
* అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
* లేఅవుట్లలో ప్రత్యేక కోటా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (సమగ్ర పాలన) బిల్లు – 2026’ పై నిర్వహించిన చర్చలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి తరఫున ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక బిల్లుకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ దాని పరిసర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1.30 కోట్ల జనాభా నివసిస్తున్నారని, పెరుగుతున్న జనాభా మరియు విస్తరణకు అనుగుణంగా ఇటువంటి చట్టం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
* హైదరాబాద్ మున్సిపల్ ప్రస్థానం..
హైదరాబాద్ నగర అభివృద్ధి పద్ధతులను వివరిస్తూ, 1955కు ముందు నిజాం పాలనలో హైదరాబాద్ కేవలం చార్మినార్, పురానాపూల్, నయాపూల్ పరిసరాలకే పరిమితమైన ఒక చిన్న మున్సిపాలిటీగా ఉండేదని గుర్తుచేశారు.
1955-1956 : హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (MCH) ఏర్పడిన సమయంలో నగరం 55 నుండి 65 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మాత్రమే కలిగి ఉండేది. మొదటి ఎన్నికల అనంతరం చార్మినార్ (ఓల్డ్ సిటీ), హైదరాబాద్ (న్యూ సిటీ) అనే రెండు డివిజన్లుగా విభజించారు.
2007 సంస్కరణలు : నగర విస్తరణ ఫలితంగా 2007లో MCH ను 172 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ (GHMC)గా మార్చడం జరిగింది.
ప్రస్తుత స్థితి: ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి కార్పొరేషన్ల పరిధులను పరిగణనలోకి తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలోని 50 శాతం ప్రాంతం ఇందులో భాగమైంది. భవిష్యత్తులో నగర జనాభా 2 కోట్లకు చేరే అవకాశం ఉన్నందున, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో ఈ కోర్ అర్బన్ రీజియన్లే నిర్ణయాత్మక శక్తిగా మారతాయని అభిప్రాయపడ్డారు.
* ఆర్థిక లక్ష్యాలు.. విజన్ 2047..
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై మాట్లాడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ జిఎస్‌డిపి (GSDP) అంచనా ₹17.82 లక్షల కోట్లుగా ఉంటూ 10.5% వృద్ధి నమోదు చేయడం శుభపరిణామమని తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ లక్ష్యాల్లో భాగంగా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సంబంధించిన ప్రాధాన్యతలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
* రిజర్వేషన్లు, ఉపాధి.. చేతివృత్తుల ప్రోత్సాహం
శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్, షాద్‌నగర్ వంటి నగర శివారు ప్రాంతాలలో 50 ‘కోర్ టౌన్ల’ ప్లానింగ్ చేపట్టాలని సూచించారు. లేఅవుట్లలో కోటా: కొత్తగా అభివృద్ధి చేసే లేఅవుట్లలోని ప్లాట్లలో 34% రిజర్వేషన్ కల్పించి, బిసి, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలకు కేటాయించాలి. జనాభా ప్రతిపాదికన బీసీలకు 15%, ఎస్సీ/ఎస్టీలకు 10%, మరియు మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని కోరారు.
ఉపాధి హామీ : భూములు కోల్పోయిన రైతులకు, నిరుద్యోగ యువతకు నరేగా (NREGA) నమూనాలో కనీసం 50 రోజుల ఉపాధి హామీ కల్పించాలని కోరారు.
ఆర్టిజన్ క్లస్టర్లు : రజకులు, కుమ్మరులు, కమ్మరులు, పద్మశాలీలు వంటి చేతివృత్తుల వారి కోసం ప్రత్యేకంగా ‘ఆర్టిజన్ క్లస్టర్లు’ ఏర్పాటు చేసి, వారి ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి.
* రవాణా.. పాలనా విధానం (Apex Council) ..
ప్రజా రవాణా : కోర్ టౌన్ల నుండి ప్రధాన నగరానికి అనుసంధానంగా మేడ్చల్-సికింద్రాబాద్, శంషాబాద్-చార్మినార్ వంటి మార్గాలలో ప్రతి 15 నిమిషాలకు మెట్రో రైళ్లు మరియు ఈ-బస్సులు అందుబాటులోకి తేవాలి.
అపెక్స్ కౌన్సిల్ : ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే ‘కోర్ అపెక్స్ గవర్నింగ్ కౌన్సిల్’లో ఐఏఎస్ అధికారులు, కమిషనర్లతో పాటు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యులను చేయాలని, దీనివల్ల క్షేత్రస్థాయి పరిశీలన సులువవుతుందని స్పష్టం చేశారు.
* హైదరాబాద్ బడ్జెట్ అంచనాలు.. మౌలిక వసతులు..
ప్రస్తుత బడ్జెట్లో హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి దాదాపు ₹9,740 కోట్లు కేటాయించడాన్ని స్వాగతించారు.
హైటెక్ సిటీ ప్రాజెక్టులు & ఫ్లైఓవర్లు : ₹2,654 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ & గాంధీ సరోవర్ : ₹1,500 కోట్లు
సుంకిశాల గోదావరి స్కీమ్/STPలు : ₹1,450 కోట్లు (అదనంగా ₹1,000 కోట్ల రుణం)
రాజీవ్ యువశక్తి (ఈ-ఆటోలు) : ₹200 కోట్లు
ప్రత్యేక అభివృద్ధి నిధులు (SDF) : ₹315 కోట్లు
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ : ₹300 కోట్లు
హైడ్రా (HYDRA) చెరువుల పరిరక్షణ : ₹50 కోట్లు
* నీటి ఎద్దడి, మూసీ ప్రక్షాళనకు చర్యలు..
తాగునీరు : గతంలో 90 MGDగా ఉన్న తాగునీటి అవసరం ప్రస్తుతం 400 MGDకి పెరిగింది. సుంకిశాలలో అందుబాటులో ఉన్న డెడ్ స్టోరేజ్ నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే హైదరాబాద్ నగరానికి 24×7 తాగునీటి సరఫరా అందించవచ్చని పేర్కొన్నారు. మూసీ & కాలుష్య నివారణ మూసీ అనేది నగర చారిత్రక జీవనది. బొల్లారం, HMT వంటి పారిశ్రామిక ప్రాంతాల నుండి వచ్చే రసాయన వ్యర్థాలు మూసీ మరియు అల్వాల్ డ్రెయిన్లలో కలవకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
* హైడ్రా పరిరక్షణ చర్యలు..
ఓఆర్ఆర్ (ORR) పరిధిలో ఉన్న చెరువులు, FTL పరిధులను కాపాడుతూనే, 20-30 ఏళ్ల క్రితం ఏర్పడిన లేఅవుట్లు, నివాసాల విషయంలో పారదర్శకమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ఈ అర్బన్ రిఫార్మ్స్ (నగర సంస్కరణలు) భవిష్యత్తు తరాలకు ప్రామాణికంగా నిలుస్తాయని చెబుతూ, బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రసంగాన్ని ముగించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
