Tribal Journalists
Tribal Journalists: ఆకేరు న్యూస్, ములుగు: గిరిజన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో బానోత్ వెంకన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వెంకన్న కోరారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
అర్హత కలిగిన ప్రతి గిరిజన జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు.
సాంకేతిక పరికరాలు అందించాలి
ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేస్తున్న గిరిజన జర్నలిస్టులకు కెమెరాలు, ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ల్యాప్టాప్లు అందించాలని డిమాండ్ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు అవసరమైన పరికరాలు లేక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి జర్నలిస్టులకు అవసరమైన సాంకేతిక పరికరాలు అందించాలని కోరారు. అలాగే వార్తా సేకరణ, డిజిటల్ మీడియా, కెమెరా వినియోగం, ఇతర సాంకేతిక అంశాలపై ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని బానోత్ వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, జిల్లా సభ్యులు పోరిక సునీల్, బానోత్ యోగి, కేతిరి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
