CPM Leaders Say Communists Liberated Telangana
* CPM Leaders ఎం.డి.అబ్బాస్, సూడి కృష్ణారెడ్డి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : భూస్వాముల చేతుల్లో ఉన్న తెలంగాణను విముక్తి చేసింది కమ్యూనిస్టులే, చరిత్రను వక్రీకరిస్తే ప్రజలే తరిమికొడతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి.అబ్బాస్, రాష్ట్ర సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డి అన్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో బుధవారం రాత్రి జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, దొరలు, భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన వీరోచిత పోరాటాన్ని వక్రీకరించి మతపరమైన రంగు పులమాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఆనాడు తెలంగాణలో భూస్వాములు, దేశ్ముఖ్లు, దొరల చేతుల్లో రైతులు, కూలీలు తీవ్ర దోపిడీకి గురయ్యారని, వెట్టి చాకిరీ, అధిక కౌలు, బలవంతపు వసూళ్లు, మహిళలపై అత్యాచారాలు, భూముల నుంచి రైతులను వెళ్లగొట్టడం వంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పేరుతో, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజలు సంఘటితమయ్యారని అన్నారు.
1946లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1951 వరకు కొనసాగిందని, తెలిపారు, ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టులు గ్రామస్థాయికి పోరాటాన్ని తీసుకెళ్లి, వెట్టి నిర్మూలన, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని బలోపేతం చేశారని నాయకులు గుర్తుచేశారు.
ఆంధ్ర మహాసభలో పనిచేసిన కమ్యూనిస్టులు 1946లో నాయకత్వ స్థానాల్లోకి వచ్చి, గ్రామస్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసి రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించినట్లు తెలిపారు. తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో కమ్యూనిస్టుల పాత్రను చెరిపేయడం ఎవరి తరం కాదు అన్నారు.
* వెట్టి చాకిరీని వ్యతిరేకంగా..
వేలాది గ్రామాల్లో రైతాంగం సంఘటితమై దొరల దోపిడీకి ఎదురు నిలిచిందని, వెట్టి చాకిరీని వ్యతిరేకించి, భూమి సమస్యను ముందుకు తెచ్చి 10 లక్షల భూమిని తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పంచారని మూడు వేల గ్రామాలు గ్రామ రాజ్యాలుగా నిర్మాణమయ్యాయని పేర్కొన్నారు.
అయితే బీజేపీ నాయకులు సెప్టెంబర్ 17 నాటి చరిత్రను కేవలం హిందూ, ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడం చరిత్రకు అన్యాయం చేయడమే అని విమర్శించారు. తెలంగాణ రైతాంగ పోరాటం కేవలం మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదన్నారు.
* భూస్వామ్య దోపిడీ..
నిరంకుశ పాలనతో పాటు భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకిరీ, రైతులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా సాగిన విస్తృత ప్రజా పోరాటమని అన్నారు. ఆ పోరాటంలో నిజంగా ప్రజల పక్షాన నిలిచింది ఎవరు? రైతుల కష్టాల్లోకి వెళ్లింది ఎవరు? దొరల దోపిడీకి ఎదురు నిలిచింది ఎవరు? అనే ప్రశ్నలకు చరిత్రే సమాధానం చెబుతుందన్నారు.
నేటి రాజకీయ ప్రయోజనాల కోసం ఆనాటి పోరాటంలో లేని శక్తులకు చరిత్రలో పాత్రను ఆపాదించడం సరికాదని, తమ విమర్శ ప్రకారం ఆ కాలంలో ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు కూడా రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం కాలేదన్నారు.
ప్రజల వెట్టి బాధలు, భూస్వాముల దోపిడీపై ఆ సంస్థ నాయకత్వం ప్రజల పక్షాన నిలబడలేదని వారు విమర్శించారు. ఆనాటి కాంగ్రెస్ వైఖరిపైనా చరిత్రను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు.
* తెలంగాణ వ్యాప్తంగా..
కాంగ్రెస్కు చెందిన పటేల్, సైన్యం, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ పోరాటాన్ని పరిశీలించి ఈ పోరాటం ఇలాగే కొనసాగితే కమ్యూనిస్టులు తెలంగాణ పై పట్టు సాధించి విజయం సాధిస్తారని ఆ విజయం భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులకు ఒక బలాన్ని చేకూరుతుందన్నారు.
అంచనా వేసి ఆ పోరాటన్ని అణిచివేయాలని ఒక కుట్ర పని హైదరాబాద్ స్టేట్ ను భారతదేశంలో విలీనం చేయాలని 1948లో నిజాంతో ఒక ఒప్పందం ప్రకారమే నిజాంను లొంగదీసుకుని గవర్నర్ బిరుదు ప్రధానం చేసి రాచ మర్యాదలు చేశారని పేర్కొన్నారు.
వేలాదిమంది కమ్యూనిస్టు నాయకులను పటేల్ సైన్యం బలి తీసుకుందని రజాకార్ల దాడిలో చనిపోయిన దానికంటే భారత యూనియన్ సైన్యాల దాడిలోనే ఎక్కువమంది చనిపోయారని గుర్తు చేశారు. మొత్తంగా ఆ పోరాటంలో 4000 మంది అమరులయ్యారని అన్నారు.
కమ్యూనిస్టులు తరిమికొట్టిన దొరలను కాంగ్రెస్ ఖద్దరు టోపీలతో మళ్ళీ గ్రామాలకు రప్పించి తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు, చరిత్రలోని ఈ అంశాలను నేటి యువత అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.
రైతులు, కూలీలు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే వారోత్సవాల ఉద్దేశమని, ఆనాటి పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై కూడా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, రాపర్తి సోమయ్య, మండల కార్యదర్శి మునిగెల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్, ఎండి షబానా, గుండెబోయిన రాజు, ఎండి అసరుద్దీన్, సుంచు విజేందర్ మండల కమిటీ సభ్యులు, కత్తుల రాజు, గట్ల మల్లారెడ్డి, తోడంగల ఐలయ్య, మంద మహేందర్, పోలాసు పరమేష్, కత్తుల రాజు, ఉపసర్పంచ్ లింగనబోయిన రాజు, కడుదుల నర్సిరెడ్డి వంగపండ్ల సోమయ్య, రామగోని సతీష్, పోలాస్ కిష్టయ్య, దాసరి కొమురయ్య, బోయిని రాజు, మారబోయిన మల్లయ్య గొడిశాల యాదగిరి దైద కుమార్ సట్ల రాజు లింగనబోయిన కుమార్, శ్రీకాంత్ మంద మొగిలి, పోలాసు పద్మాకర్, నీరటి సంపత్, కాసాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
