Khammam
* ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తండ్రి ఆత్మహత్య
* తండ్రి, కూతురు మృతి.. కుమారుడి పరిస్థితి విషమం
Khammam: ఆకేరు న్యూస్, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తండ్రితో పాటు 14 ఏళ్ల కుమార్తె మృతి చెందగా.. కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఏం జరిగింది?
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (44)కు కుటుంబ, వ్యక్తిగత సమస్యలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించిన అనంతరం తానూ పురుగుల మందు సేవించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో శ్రీనివాసరావుతో పాటు ఆయన 14 ఏళ్ల కుమార్తె మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన కుమారుడిని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గ్రామంలో విషాదం
ఈ ఘటనతో అప్పలనర్సింహాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలే ఘటనకు కారణమా? ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
