Uttar Pradesh
* విడాకుల వరకు వెళ్లిన వృద్ధ దంపతులు..
* పోలీసుల చొరవతో కలిసిన జంట
ఆకేరు న్యూస్, డెస్క్: చిన్న చిన్న మనస్పర్థలకే దంపతులు విడాకులు తీసుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తున్నాం. అయితే, 51 ఏళ్ల వైవాహిక బంధం చివరకు విడాకుల వరకు వెళ్లడం కలచివేసింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో పోలీసుల చొరవతో వృద్ధ దంపతులు తిరిగి ఒక్కటయ్యారు.
51 ఏళ్ల క్రితం వివాహం
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ దంపతులకు 51 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమారులు ఉన్నారు. ఎన్నో ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ దంపతులు వృద్ధాప్యంలో మాత్రం అనుకోని ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
తల్లిదండ్రుల బాధ్యత విషయంలో కుమారుల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా నలుగురు కుమారులు తల్లిదండ్రులను వేర్వేరుగా చూసుకోవడం ప్రారంభించారు. దీంతో భార్యాభర్తలు కూడా విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విడాకుల వరకు వ్యవహారం
భర్తకు దూరంగా ఉంటున్న వృద్ధ మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మందుల ఖర్చులకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇక కలిసి ఉండటం కంటే విడిపోవడమే మంచిదని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన ఈ వృద్ధ దంపతుల పరిస్థితిని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. 51 ఏళ్ల బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు.
నెలకు రూ.5 వేల భరోసా
వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయంలో విడిపోవడం సరికాదని పోలీసులు వారికి నచ్చజెప్పారు. భార్య పోషణ, మందుల ఖర్చుల కోసం భర్త ప్రతి నెల రూ.5 వేలు ఇవ్వాలని అంగీకారం కుదిర్చారు. పోలీసుల చొరవతో ఇద్దరూ తమ మనసులోని బాధలను ఒకరికొకరు చెప్పుకున్నారు. చివరకు విడాకుల నిర్ణయాన్ని విరమించుకుని మళ్లీ కలిసి జీవించేందుకు అంగీకరించారు. దీంతో 51 ఏళ్ల వైవాహిక బంధం విడాకుల దాకా వెళ్లి.. చివరి నిమిషంలో మళ్లీ చిగురించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
