Peddalodi School
* మిగిలిన ఫంక్షన్ ఫుడ్‌తో విద్యార్థులకు అస్వస్థత
* వైస్ ప్రిన్సిపల్ పరిస్థితి విషమం
Peddalodi School: ఆకేరు న్యూస్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాఠశాలలో సుమారు 20 మంది విద్యార్థులతో పాటు వైస్ ప్రిన్సిపల్ అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తినట్లు సమాచారం.
ఫంక్షన్లో మిగిలిన ఆహారం
పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ ఇంట్లో బుధవారం ఓ శుభకార్యం జరిగింది. ఆ వేడుకలో మిగిలిన ఆహారాన్ని గురువారం పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డించినట్లు తెలుస్తోంది. ఆ ఆహారం పాడై ఉండటంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ఆసుపత్రుల్లో చికిత్స
అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులను సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి, మరో ఐదుగురిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదే ఆహారం తిన్న వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆయనను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
అధికారుల విచారణ
పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత శుభకార్యానికి సంబంధించిన ఆహారాన్ని వడ్డించడంపై తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు కలిగేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
