Yadadri Collectorate
* సమయానికి రాని అధికారులు, సిబ్బందికి షాక్..
* ప్రధాన గేటుకు తాళం వేయించిన కలెక్టర్
ఆకేరు న్యూస్, యాదాద్రి భువనగిరి జిల్లా : కలెక్టరేట్లో సమయపాలన పాటించని అధికారులు, సిబ్బందిపై ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్రావు కఠినంగా వ్యవహరించారు. నిర్ణీత సమయానికి విధులకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళం వేయించారు.
కలెక్టరేట్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ఉదయం 10:30 గంటలకు విధులకు హాజరు కావాల్సి ఉండగా, పలువురు సమయానికి కార్యాలయానికి రావడం లేదని ఇన్చార్జ్ కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. దీంతో పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఆయన.. ఉదయం 10:45 గంటలకు కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళం వేయించారు.
అధికారులు, సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు ఇప్పటికే లొకేషన్ ఆధారిత హాజరు విధానం అమల్లో ఉన్నప్పటికీ సమయపాలన పాటించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ.. కలెక్టరేట్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఉదయం 10:30 గంటలకు విధులకు హాజరు కావాలి. ఉదయం 8 గంటలకే రావాలని ఎవరినీ చెప్పలేదు. అయినప్పటికీ నిర్ణీత సమయానికి హాజరు కాకపోవడంతో 10:45 గంటలకు గేటుకు తాళం వేశాం అని తెలిపారు.
ప్రజల నుంచి అధికారులు సమయానికి కార్యాలయాలకు రావడం లేదనే ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇకపై కూడా సమయానికి విధులకు హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేయడానికే మనం కార్యాలయాల్లో ఉన్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలి” అని ఇన్చార్జ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
