Minister seethakka
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: కాకతీయుల శిల్పకళా వైభవం, పచ్చని అడవులు, సెలయేళ్లు, జలపాతాలు, గుట్టలు, వాగులతో ములుగు జిల్లా ప్రకృతి, చారిత్రక సంపదకు నిలయంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. చారిత్రక, ప్రకృతి సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
రామప్పలో వరల్డ్ టూరిజం డే
వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం ఆవరణలో శుక్రవారం వరల్డ్ టూరిజం డే–2026ను పురస్కరించుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన హెరిటేజ్ వాక్, తెలంగాణ దర్శిని, కాంపిటీషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క.. జిల్లా కలెక్టర్‌తో కలిసి గొల్లల గుడి నుంచి రామప్ప దేవాలయం వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్‌ను ప్రారంభించారు. ఈ ఏడాది వరల్డ్ టూరిజం డేను డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే థీమ్‌తో నిర్వహించారు.
రామప్పను విశ్వవ్యాప్తం చేయాలి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 13వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప దేవాలయం కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం గొప్పతనాన్ని మరింతగా విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ములుగు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉండటంతో పచ్చని అడవులు, గుట్టలు, వాగులు, సెలయేళ్లు, వన్యప్రాణులతో అపారమైన ప్రకృతి సంపద ఉందన్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి పర్యాటక ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని తెలిపారు. పర్యావరణం, చారిత్రక వారసత్వ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులకు బహుమతులు
కార్యక్రమంలో కళాకారులు, విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పౌర సంబంధాల శాఖ సంస్కృతిక కళాసారధి కళాకారుల బృందం ప్రదర్శించిన గేయాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
చల్వాయి టీజీఎంఎస్‌కు చెందిన డి. శ్రీజ బృందం ప్రథమ బహుమతి, దేవగిరిపట్నం తెలంగాణ మైనారిటీ బాలికల పాఠశాలకు చెందిన ఆర్. శ్రీవల్లి ద్వితీయ బహుమతి సాధించారు. గోవిందరావుపేట బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్. మనస్విని, ఎ. శ్రుతి, ఎం. పావలి తృతీయ బహుమతి అందుకున్నారు. గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఎం.డి. యాస్మిన్ విజేతగా, మంగపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన కె. దిలీప్ రన్నరప్‌గా నిలిచారు. తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన రంజిత్, రుత్విక్ ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్ జి, సంపత్ రావు, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, టూరిజం నోడల్ అధికారి ధర్మ నాయక్, స్థానిక సర్పంచ్ రాజు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
