AP Local Body Elections
*6 వారాల్లో ఎన్నికల ప్రక్రియ
* 34 శాతం రిజర్వేషన్లను కొట్టేసిన ధర్మాసనం
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి ఏపీ హైకోర్టు తెరదించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తక్షణమే వేగవంతం చేసి, రాబోయే ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక పోరుకు మార్గం సుగమమైంది.
*బీసీల 34% రిజర్వేషన్ల జీవో రద్దు
ఈ విచారణలో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కూడా ధర్మాసనం కొట్టేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటుతున్నాయని పేర్కొంది.
అలాగే ఓటర్ల జాబితా సవరణ, సమగ్ర సర్వే మరియు బీసీ జనగణన పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ వైకాపా సహా దాఖలైన పలు అభ్యంతర పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.
*సిద్ధమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనుంది. కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను మరోసారి నిర్దారించి, ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంపై అధికారులు దృష్టి సారించారు.
వచ్చే ఆరు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక సమరానికి పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి. తాజాగా కోర్టు తీర్పుతో మరింత వేగం పెంచనున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
