Tirupati Cheddi Gang
*అర్ధరాత్రి సీసీ కెమెరాల్లో కదలికలు
ఆకేరు న్యూస్, తిరుపతి : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ కదలికలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తిరుచానూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో అర్ధరాత్రి వేళ ముఠా సభ్యులు సంచరించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
కొత్తపాలెం గ్రామంలోని పలు వీధుల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు ముఠా సభ్యుల దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ముఖాలకు రుమాళ్లు చుట్టుకుని, చేతుల్లో రాడ్లు,మారణాయుధాలు పట్టుకుని తిరుగుతున్న ఈ దొంగలను చెడ్డీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయాన్నే సీసీ ఫుటేజీని గమనించిన స్థానికులు భయందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, దొంగల కదలికల ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠా పాత నేరస్థులదా లేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠా సభ్యులా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనతో తిరుచానూరు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్‌ను మరింత తీవ్రతరం చేయాలని, చెడ్డీ గ్యాంగ్ బారిన పడకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
