CEC Gyanesh Kumar Protest
* CECపై నిరసన
* జంతర్ మంతర్ వద్ద టెన్షన్
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో న్యూఢిల్లీ జిల్లాలో పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ప్రజా భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణను దృష్టిలో ఉంచుకుని BNSS, 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఆంక్షలు విధించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఐదుగురికి మించి గుమిగూడితే..
ముందస్తు అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట చేరడం, ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడం, నినాదాలు చేయడం, ప్రసంగాలు ఇవ్వడంపై ఆంక్షలు విధించారు. అలాగే ఆయుధాలు, లాఠీలు, కత్తులు, ఇటుకలు, ప్లకార్డులు తదితర వస్తువులను తీసుకెళ్లడంపైనా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై BNS సెక్షన్ 223తో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
జంతర్ మంతర్ వద్ద నిరసన
CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ AISA, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు.
భద్రత పెంపు
నిరసనల నేపథ్యంలో జంతర్ మంతర్‌తో పాటు న్యూఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అదనపు పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమీపంలోని కొన్ని మెట్రో స్టేషన్ల ప్రవేశ ద్వారాలను కూడా తాత్కాలికంగా మూసివేశారు.
సెక్షన్ 163 అంటే..
BNSSలోని సెక్షన్ 163 గతంలో అమల్లో ఉన్న CrPC సెక్షన్ 144కు సమానమైన నిబంధన. అత్యవసర పరిస్థితుల్లో ప్రజా భద్రత, శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు లేదా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తాత్కాలిక ఆదేశాలు జారీ చేయడానికి ఈ నిబంధన అవకాశం కల్పిస్తుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
