జిల్లా అదనపు కలెక్టర్ ఎం. సంపత్ రావు
* జిల్లా అదనపు కలెక్టర్ ఎం. సంపత్ రావు
ఆకేరు న్యూస్, ములుగు: చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం. సంపత్ రావు పిలుపునిచ్చారు. రామప్ప దేవాలయ విశిష్టత, కాకతీయుల చారిత్రక వైభవం, వారసత్వ కట్టడాల ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
మంగళవారం వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్–2026 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యాటక శాఖ నోడల్ అధికారి ధర్మనాయక్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు, శ్రీధర్ రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్ర, పురావస్తు సంపద, వారసత్వ కట్టడాల పరిరక్షణపై ఆసక్తితో శిక్షణ పొందిన వాలంటీర్లను అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రామప్ప దేవాలయ నిర్మాణ ప్రత్యేకతలు, చారిత్రక నేపథ్యం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా యువత వారసత్వ సంపద సంరక్షణలో చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పర్యాటక శాఖ నోడల్ అధికారి ధర్మనాయక్ మాట్లాడుతూ.. ఇలాంటి శిక్షణ శిబిరాలు యువతకు కెరీర్ పరంగానూ ఉపయోగపడతాయని తెలిపారు. వివిధ ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జీవనశైలిపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ శిబిరాలు మంచి అవకాశమని పేర్కొన్నారు. శిక్షణలో పొందిన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటూ కాకతీయుల ఘనకీర్తిని ప్రపంచానికి చాటాలని వాలంటీర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ చల్లగొండ రాజు, పర్యాటక శాఖ గైడ్లు గోరంటల విజయ్ కుమార్, వెంకటేష్, రాష్ట్ర పురావస్తు శాఖ ఫోర్మన్ బాబు, టూరిస్ట్ పోలీసులు అరుణ్, భద్రు, వివిధ శాఖల సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

