Police Harassment Youth Suicide Attempt
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లాలో పోలీసుల విచారణ తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీరోల్ మండలం కొర్లకుంట్ల తండాకు చెందిన దారవత్ చరణ్ అనే యువకుడు పోలీసుల వేధింపులు, అవమానాలు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం సదరు యువకుడు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.
*తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారని….
కుటుంబ సభ్యులు మరియు బాధితుడు చరణ్ ఆసుపత్రి నుంచి విడుదల చేసిన సెల్ఫీ వీడియో వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఒక అమ్మాయి మిస్సింగ్ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం సీరోల్ పోలీసులు కొర్లకుంట్ల తండాకు వచ్చారు. ఆ సమయంలో ఏఎస్ఐ సోమన్న.. తండావాసులందరి ముందే చరణ్‌ను బూటు కాళ్లతో తన్నుకుంటూ, తీవ్రంగా కొడుతూ పోలీస్ వాహనం ఎక్కించారని బాధితుడు ఆరోపించారు. స్టేషన్‌కు తరలించిన తర్వాత కూడా తనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారని చరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
* అవమానం భరించలేకే..
అందరి ముందు పోలీసులు చేసిన అవమానాన్ని, స్టేషన్లో జరిగిన వేధింపులను తట్టుకోలేక తీవ్ర మానసిక క్షోభకు గురైన చరణ్.. మరుసటి రోజు (ఆగస్టు 16న) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రి బెడ్‌పై నుంచి విడుదల చేసిన వీడియోలో చరణ్ మాట్లాడుతూ.. “నన్ను బహిరంగంగా అవమానించారు, వేధించారు. నాకు ఏమైనా జరిగితే దానికి సంబంధిత పోలీసు అధికారులే బాధ్యులు” అని పేర్కొనడం గమనార్హం.
* పరిస్థితి విషమం.. ప్రజా సంఘాల డిమాండ్…
చరణ్ గడ్డి మందు తాగిన విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చరణ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఘటనపై స్థానిక ప్రజలు, గిరిజన, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇలా అమానుషంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, నిష్పాక్షిక విచారణ జరిపించాలని.. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
