ACB Raids Deputy Director Narahari
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అవినీతి అధికారుల గుట్టురట్టు చేసేందుకు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) మరోసారి గట్టి పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో, ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కొంకరి నరహరిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచే విస్తృత తనిఖీలు చేపట్టారు.
* ఏకకాలంలో 13 చోట్ల సోదాలు…
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో అధికారులు హైదరాబాద్లోని చార్మినార్, నారాయణగూడ సహా పలు కీలక ప్రాంతాలలో ఏకకాలంలో దాదాపు 13 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. నరహరి నివాసంతో పాటు ఆయన కార్యాలయాలు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
* రూ.1.10 కోట్ల నగదు, బంగారం స్వాధీనం…
ఈ సోదాలలో భాగంగా అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. నరహరి ఇల్లు, కార్యాలయాల నుంచి కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్లు, భారీగా బంగారు ఆభరణాలతో పాటు ఏకంగా రూ.1.10 కోట్ల భారీ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తమ్ముడి ఇంట్లోనూ తనిఖీలు.. అన్నదమ్ముల విచారణ
కొంకరి నరహరితో పాటు ఆయన తమ్ముడి నివాసంలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలపై ఈ అన్నదమ్ముల నుంచి ఏసీబీ అధికారులు లీగల్ ఆధారాలను, వివరాలను సేకరిస్తున్నారు.
* పాత లీలలపై ఏసీబీ అనుమానాలు
భూమి సర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూమి స్వాధీనం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న నరహరి, గతంలో రంగారెడ్డి జిల్లాకు ఏడీ (AD)గా కూడా పనిచేశారు. ఆ సమయంలో కూడా ఆయన భారీగా అక్రమాలకు పాల్పడి, ఆస్తులు కూడబెట్టారనే అనుమానాలను ఏసీబీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
