Seethakka Distributes Bicycles Students
* అటవీ ప్రాంతం అక్షరాస్యతలో ములుగు ముందంజ
* ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 50 సైకిళ్ల పంపిణీ
– రాష్ట్ర మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు:
ఏజెన్సీ అటవీ ప్రాంత జిల్లాగా పేరుగాంచిన ములుగు జిల్లా విద్యా రంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని, విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 50 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ములుగు జిల్లా నిరక్షరాస్యత అధికంగా ఉన్న వెనుకబడిన జిల్లా అయినప్పటికీ జిల్లా అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగా ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానం, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం గర్వకారణమన్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో 50 సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు సైకిళ్లు తదితర సేవా కార్యక్రమాలతో సమాజానికి అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఈ సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం రాష్ట్రంలో మహిళా అక్షరాస్యతకు కొత్త దిశానిర్దేశం చేస్తోందన్నారు. చదువురాని 12 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను గుర్తించామని, మొదటి విడతగా 6 లక్షల మందికి లిటరసీ పరీక్షలు నిర్వహించగా 83.33 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మరో 6 లక్షల మందిని పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని, భవిష్యత్తులో వారందరినీ పదో తరగతి పరీక్షలకు సిద్ధం చేసే కార్యాచరణ చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత లేకుండా ప్రతి మహిళను అక్షరాస్యత వైపు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా కష్టపడి చదవాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ, పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం సంతోషకరమని అన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహిన్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఐఈఓ వీరేంద్ర కుమార్, రోటరీ క్లబ్ ప్రతినిధులు చంద్రమౌళి, గణేష్, ఇతర సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
