Allu Arjun Court Hearing Today
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసు విచారణ నేడు నాంపల్లి కోర్టులో జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరూ విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
* వర్చువల్‌గా అల్లు అర్జున్..
గతంలో జరిగిన కోర్టు విచారణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్చువల్‌గా (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) హాజరయ్యారు. తాజా సమాచారం ప్రకారం.. నేడు జరగబోయే విచారణకు కూడా ఆయన వర్చువల్ విధానంలోనే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* కోర్టు సీరియస్.. ఆ ఇద్దరు వస్తేనే విచారణ
గత విచారణల సమయంలో కేసులోని ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరు కాలేదు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారని, వారందరూ కోర్టుకు హాజరైతేనే తదుపరి విచారణ కొనసాగుతుందని గతంలోనే కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, గతంలో గైర్హాజరైన ఇద్దరు నిందితులతో పాటు మిగిలిన వారంతా నేడు కోర్టు ముందుకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. నిందితులందరి హాజరు ఆధారంగానే నేడు నాంపల్లి కోర్టు విచారణను ముందుకు తీసుకెళ్లనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
