Bandi Bhagirath Bail
* షరతులతో కూడిన కోర్టు బెయిల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మైనర్ బాలికల లైంగిక దాడి నిరోధక చట్టం (పోక్సో) కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు నాంపల్లి (మల్కాజ్గిరి) న్యాయస్థానం శనివారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని వారాలుగా చర్లపల్లి కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు, న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
* కేసు నేపథ్యం…
మైనర్ బాలిక (17 ఏళ్లు) తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే నెలలో సైబరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ రక్షకభట నిలయం (పోలీస్ స్టేషన్)లో బండి భగీరథ్‌పై తొలిసారిగా కేసు నమోదైంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బాలికతో ఉన్న పరిచయం కాస్తా మానసిక, శారీరక వేధింపులకు దారితీసింది. జనవరి 2026 లో వీరి సంబంధం ముగిసిన తర్వాత బాలిక తీవ్ర మానసిక క్షోభకు గురైందని, చట్టపరంగా ముందుకెళ్లకుండా తమపై తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయని బాధితురాలి తల్లి బహిరంగ ప్రకటనలో ఆరోపించారు.
ఈ క్రమంలో మే 8న పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, ప్రాథమికంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ తరపు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టును) ఆశ్రయించినప్పటికీ, అక్కడ పిటిషన్ ఉపసంహరణకు గురికావడంతో.. పోలీసులు అప్పా జంక్షన్ సమీపంలో భగీరథ్‌ను బంధించి మల్కాజ్గిరి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు, దర్యాప్తు కోసం 3 రోజుల పాటు పోలీసుల విచారణకు అనుమతి ఇచ్చింది.
* నమోదు చేసిన కీలక చట్టాలు…
బాధిత బాలిక నుంచి మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసిన అదనపు వాంగ్మూలం, ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన ఆధారాల బట్టి పోలీసులు తొలుత ఉన్న చట్టాలతో పాటు మరికొన్ని కఠినమైన, బెయిల్ దొరకని సెక్షన్లను చేర్చారు.
పోక్సో చట్టం: మైనర్లపై లైంగిక దాడి, వేధింపుల నిరోధక చట్టం కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు.
* భారతీయ న్యాయ సంహిత 64(2)(m)…
ఈ చట్టం ప్రకారం ఒకే మహిళపై లేదా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైతే ఈ నిబంధన కింద కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. నిందితుడు తాను వాడిన చరవాణిలోని (మొబైల్ ఫోన్) సమాచారాన్ని తొలగించడం, సిమ్ కార్డులు మార్చడం వంటి చర్యల ద్వారా డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశాడనే ఆరోపణలపై అదనపు సెక్షన్లను జత చేశారు.
* న్యాయస్థానంలో వాదనలు – బెయిల్ మంజూరు
దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్ తరపున న్యాయవాదులు మల్కాజ్గిరి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడి నుంచి ఇప్పటికే పోలీసు విచారణ పూర్తయిందని, దర్యాప్తుకు అవసరమైన సమాచారాన్ని పోలీసులు సేకరించారని నిందితుడి తరపు న్యాయవాదులు వాదించారు.
ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, దర్యాప్తుకు సహకరించాలనే నిబంధనలతో పాటు నిర్దేశిత భద్రతా పూచీకత్తులను సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామంతో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన ఈ రాజకీయ, చట్టపరమైన వివాదంలో బండి భగీరథ్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది.
