Rajaiah Farmer Declaration station ghanpur
* రైతు డిక్లరేషన్ను తుంగలో తొక్కిన కాంగ్రెస్
– మాజీ ఎమ్మెల్యే డా. రాజయ్య
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రైతు బీమా, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా విస్మరిస్తూ రైతు డిక్లరేషన్ను తుంగలో తొక్కిందని మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ఆరోపించారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ను ప్రకటింపజేసి, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఏ పంట కొనమంటే ఆ పంటనే, ఎంత కొనమంటే అంతే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే 40 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 25 లక్షల మందికే పరిమితమైందని దుయ్యబట్టారు. రూ.20 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ రైతుల ఖాతాల్లో సుమారు రూ.12 వేల కోట్లే జమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ రైతును అడిగినా తన రుణమాఫీ పూర్తిగా జరిగిందని చెప్పే పరిస్థితి లేదని రాజయ్య అన్నారు.
రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.15 వేల చొప్పున, కౌలు రైతులకు కూడా అదే స్థాయిలో, భూమిలేని రైతులకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఐదు సార్లు రైతు భరోసా చెల్లింపులు జరగాల్సి ఉండగా, కేవలం రెండు సార్లు మాత్రమే ఇచ్చి రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిరలో మళ్లీ సభ పెట్టి రైతు భరోసా పేరుతో రైతులను నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు గత రెండు నెలలుగా ఒత్తిడి తీసుకురావడంతో కొంత మేర కొనుగోళ్లు జరిగాయని అయినప్పటికీ కేవలం 60 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా, మిగిలిన 40 శాతం మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, దేశంలో ధాన్యం కొరత ఉన్న రాష్ట్రాలకు తెలంగాణలో పండిన ధాన్యాన్ని సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
కేసీఆర్ హయాంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను మించి తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి జరిగిందని తెలిపారు. రైతు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేశారని అన్నారు. రైతులకు అవసరమైన యూరియా ఎరువులను సైతం అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు అన్నారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు.
రైతు సమస్యలపై నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న జనగాం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే బి ఎల్ ఎ సమావేశానికి కేటీర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని ఈ శిక్షణ శిబిరానికి పార్టీ నియమించిన బిఎల్ ఏలు, మండల అధ్యక్షులు, ఇన్చార్జులు, కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో చింతకుంట్ల జగన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, చందర్ రెడ్డి, వెంకటస్వామి, రాజ్ కుమార్, మారేపల్లి ప్రసాద్, అశోక్, బొల్లంవి విజయ్, పావని, కవిత, రమ, జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
