TGNPDCL Electrical Safety
అకేరు న్యూస్ డెస్క్ :టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని సంస్థ సీఎండీ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి హెచ్చరించారు.
హన్మకొండ , నక్కలగుట్ట ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 18 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎండీ మాట్లాడుతూ అనుమతి లేని వ్యక్తులకు ఎల్సీలు ఇవ్వడం తీవ్ర తప్పిదమని హెచ్చరించారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రతి పనికి భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అనధికారంగా ఎవరిని కూడా లైన్లు ఎక్కించి పనులు చేయించడం నేరమని అన్నారు.
ఆపరేషన్ సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటూ పనులు చేపట్టాలని ఆదేశించారు. లైన్ క్లియరెన్స్‌లు తప్పనిసరిగా ఎల్సీ యాప్ ద్వారానే జరగాలని లేని పక్షములో క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రాణం కంటే విలువైదని ఏది కాదని, విద్యుత్ పనులు చేపట్టే సమయంలో అన్ని భద్రతా పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని, భద్రతా నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించాలని అన్నారు.
క్షేత్ర స్థాయిలో విద్యుత్ పనులు నిర్వర్తించేటప్పుడు కచ్చితంగా వన్ మినిట్ రూల్ పాటించాలని హడావుడిగా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు .
ప్రతి అధికారి, ఉద్యోగి తమ పరిధిలోని విద్యుత్ నెట్‌వర్క్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదభరితంగా ఉన్న డబుల్ ఫీడింగ్ పాయింట్లు, లూజ్ లైన్లు, వంగిన విద్యుత్ స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న లైన్లు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ గద్దెలను గుర్తించి వెంటనే సరిచేయాలని ఆదేశించారు.
ప్రతి సర్కిల్ పరిధిలో ఆర్టిజన్లు, లైన్మెన్లకు విద్యుత్ భద్రత పై శిక్షణా తరగతులు నిర్వహించాలని,వినియోగదారులతో సత్ప్రవర్తనతో మెలుగుతూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు . ప్రతి ఒక్కరిలో విద్యుత్ భద్రత పరంగా మార్పు రావాలని ఆ మార్పు అందరికి దిక్సూచిగా ఉండాలని అన్నారు .
అకస్మాత్తుగా సంభవించే భారీ వర్షాలు, ఈదురుగాలుల వలన స్థంబాలు విరిగి , లైన్లు దెబ్బతింటున్నాయి కనుక విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలన్నారు . అవసరమైన సామగ్రి, వనరుల కొరత లేకుండా సంస్థ పూర్తిస్థాయిలో సన్నదంగా ఉన్నామని తెలిపారు.
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేయాలని, “మీ భద్రత – మన బాధ్యత” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సీఎండీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి . మోహన్ రావు , సి . ప్రభాకర్ , సి.ఈ లు కె . తిరుమల్ రావు , కె . రాజు చౌహన్, అశోక్ , మాధవ రావు , అన్నపూర్ణ , నాగ ప్రసాద్ , సురేందర్, జియంలు నాగప్రసాద్ , శ్రీనివాస్ , ఈఈ సివిల్ వెంకటేశ్వర్లు , డి.ఈ లు అనిల్ కుమార్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
