Bathukamma Festival
* తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ వేడుకలు
Bathukamma Festival| ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ: ఎక్కడైనా దేవుడిని పూలతో పూజిస్తారు.. కానీ, పూలనే దైవంగా భావించి ఆరాధించే ఏకైక వేడుక బతుకమ్మ పండగ. తొమ్మిది రోజుల పాటు ఊరూవాడా తీరొక్క పూలతో, ఉయ్యాల పాటలతో మారుమోగే ఈ వైభవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ప్రకృతిని ఆరాధిస్తూ, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవం విశేషాలపై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం
తెలంగాణ సాంప్రదాయాలకు, సంస్కృతికి బతుకమ్మ పండగ ప్రధాన ప్రతీక. ఈ నేలపై శతాబ్దాలుగా ఈ వేడుకను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భాద్రపద అమావాస్యరోజున ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకలు చివరకు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే తంగేడు, గునుగు, చామంతి, బంతి, మందార వంటి రంగురంగుల పూలను సేకరించి ఇత్తడి తాంబులంలో అందంగా బతుకమ్మను పేరుస్తారు.
పుట్టుక వెనుక చారిత్రక నేపథ్యం
బతుకమ్మ పండగ ఆవిర్భావం వెనుక ఎన్నో చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాములు, పెత్తందార్ల దౌర్జన్యాలకు నలిగిపోయి బలైన గ్రామీణ మహిళలను తలుచుకుంటూ తోటి మహిళలు విలపించేవారని, వారి జ్ఞాపకార్థం పూలను పేర్చి “బతుకమ్మా.. బతుకమ్మ” అంటూ పాటలు పాడేవారని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి వేదన నుంచే ‘బతుకమ్మ ఉయ్యాలో’ అనే పాట పుట్టుకొచ్చిందని చరిత్ర చెబుతుంది.
కూకట్పల్లి లో ప్రత్యేకత..
నగరం నడిబొడ్డున ఉన్న కూకట్పల్లి గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఎంతో ప్రత్యేకం. ఇక్కడ రెండు రోజుల ముందుగానే వేడుకలు ఆరంభమవుతాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తైన బతుకమ్మలను ఇక్కడ పేరుస్తారు. తరతరాలుగా వస్తున్న అచ్చమైన జానపద పాటలతో మహిళలు హోరెత్తిస్తారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా, మహిళలు బతుకమ్మలను ఆడి ఐడీఎల్ చెరువు వరకు ఊరేగింపుగా వెళ్లి అక్కడే నిమజ్జనం చేయడం ఇక్కడి ప్రత్యేకత.
తీరొక్క పాటలు.. గౌరమ్మ కొలువులు
“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి వీధిలోనూ మహిళల గాత్రాలు మారుమోగుతాయి. గౌరమ్మను కొలుస్తూ బంగారంలాంటి జీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటూ మహిళలు చేసే నృత్యాలు కనులవిందుగా ఉంటాయి. ఆడిన ప్రతి బతుకమ్మను సమీపంలోని చెరువుల్లో లేదా ప్రత్యేక తొట్టిలలో నిమజ్జనం చేసి, నైవేద్యాలు పరస్పరం మార్చుకుంటారు.
తొమ్మిది రోజుల ప్రత్యేకతలు ఇలా..
బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు రోజూ ఒక ప్రత్యేక నైవేద్యం తయారు చేసి గౌరమ్మకు సమర్పిస్తారు.. ఏరోజు ఏం చేస్తారంటే..
* మొదటి రోజు: ఎంగిలి పూల బతుకమ్మ (నువ్వులు, బియ్యంపిండి)
* రెండో రోజు: అటుకుల బతుకమ్మ (అటుకులు, పప్పు, బెల్లం)
* మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ (పెసలు, పాలు, చక్కెర)
* ఐదవ రోజు: అట్ల బతుకమ్మ (అట్లు లేదా దోశలు)
* ఆరవ రోజు: అలిగిన బతుకమ్మ
* ఏడవ రోజు: వేపకాయల బతుకమ్మ (బియ్యం పిండి వేపకాయలు)
* ఎనిమిదో రోజు: వెన్న ముద్ద బతుకమ్మ (వెన్న, నువ్వుల ఉండలు)
* తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ (దుర్గాష్టమి రోజున పెరుగన్నం, పులిహోర వంటి ఐదు రకాల నైవేద్యాలు)

Please tell us what is wrong. Your report will be sent to the website team.
