BIHAR SCHOOL SNAKE IN FOOD STUDENTS FELL ILL
స్కూల్ ఫుడ్‌లో పాము..
ఆసుపత్రి పాలైన వందలాది మంది విద్యార్థులు..
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ రాష్ట్రం సహర్సా జిల్లాలోని బాలువాహ గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఘోర ప్రమాదం తప్పింది. విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
* ఒక్కసారిగా షాక్…
స్కూల్ సిబ్బంది వడ్డించిన ఆహారాన్ని తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడం, కడుపునొప్పితో విలవిలలాడటం ప్రారంభించారు. ఆందోళన చెందిన ఉపాధ్యాయులు భోజనాన్ని పరిశీలించగా, వండిన పదార్థాల్లో చనిపోయిన పాము పిల్ల కనిపించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
* హుటాహుటిన ఆసుపత్రికి…
ఈ ఘటనలో సుమారు 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన స్పందించి అంబులెన్స్‌ల ద్వారా విద్యార్థులను సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* తల్లిదండ్రుల ఆగ్రహం…
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. భోజనం వండే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు మండిపడుతున్నారు. బాధ్యులైన వంట సిబ్బంది మరియు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
