Annamalai Resignation News Tamilnadu
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. తమిళనాడు బీజేపీ అత్యంత కీలక నేత, మాజీ ఐపీఎస్ అధికారి కే. అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామం అటు చెన్నై నుంచి ఇటు ఢిల్లీ వరకు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
* ఢిల్లీలో హైడ్రామా.. ఐదు పేజీల లేఖ..
అన్నామలై ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, తన ఐదు పేజీల రాజీనామా లేఖను సమర్పించారు.
అయితే, ఈ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఇంకా అధికారికంగా ఆమోదించలేదని తెలుస్తోంది. అన్నామలై లాంటి చరిష్మా ఉన్న నేతను వదులుకోవడానికి ఇష్టపడని హైకమాండ్, ఆయనతో మళ్లీ చర్చలు జరుపుతున్నట్లు, బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
* ఎందుకు ఈ నిర్ణయం..
గత కొంతకాలంగా తమిళనాడులో బీజేపీ-ఏఐఏడీఎంకే (AIADMK) పొత్తు వ్యవహారాలు, పార్టీ అనుసరిస్తున్న ఎన్నికల వ్యూహాలపై అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ స్వతంత్రంగా ఎదగాలని ఆయన భావిస్తుండగా, అధిష్ఠాన వైఖరి అందుకు భిన్నంగా ఉండటమే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమని టాక్.
* కొత్త పార్టీ వైపు అడుగులు…
బీజేపీకి గుడ్ బై చెప్పిన అనంతరం అన్నామలై ఊరికే కూర్చోబోరని, తమిళనాడులో సరికొత్త రాజకీయ శకానికి తెరలేపనున్నారని ఆయన అనుచరవర్గం అంటోంది. త్వరలోనే ఆయన ఒక ‘కొత్త రాజకీయ పార్టీ’ లేదా ఒక ‘భారీ ప్రజా ఉద్యమాన్ని’ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి బలం చేకూరుస్తూ.. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అన్నామలై అనుచరులు సరికొత్త పోస్టర్లను వెలిశారు. కొత్త రాజకీయ వేదికను సూచించేలా ఉన్న ఈ పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ వ్యవహారంపై అన్నామలై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
