BSP leader Ravinder Goud E20 Petrol Decision
* బిఎస్ పి నేత పచ్చిమట్ల రవీందర్ గౌడ్
ఆకేరు న్యూస్, హుస్నాబాద్ :
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని కలుపుతూ తీసుకున్న ఈ20 (E20) నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం హుస్నాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది వాహనాల ఇంజన్లు, విడిభాగాలు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు సాంకేతిక సమస్యలు మరియు వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకుని 5 నుండి 10 శాతం పరిమితికి మాత్రమే ఇథనాల్ మిశ్రమాన్ని అనుమతించాయని గుర్తుచేశారు. అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌తో పాటు సాధారణ ప్యూర్ పెట్రోల్‌ను కూడా పంప్‌లలో ప్రజల ఆమోదం కోసం అందుబాటులో ఉంచుతారని, కానీ మన దేశంలో మాత్రం వాహనదారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా ఈ నిర్ణయాన్ని బలవంతంగా రుద్దుతున్నారని విమర్శించారు.
అమెరికాతో జరిగిన ఒప్పందాల్లో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ వ్యాపార ప్రయోజనాల కోసమే దేశంలోని వాహనదారులను తాకట్టు పెడుతున్నారా అని రవీందర్ గౌడ్ ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందో పార్లమెంట్లో చర్చించకుండా, నిపుణుల అభిప్రాయాలు తీసుకోకుండా ముందుకు వెళ్లడం నిరంకుశత్వమేనని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ అపసవ్య ఆర్థిక విధానాల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా దిగజారిపోయిందని, దేశంలో పేద మరియు మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి దారిద్య్రరేఖ దిగువకు పడిపోతోందని దుయ్యబట్టారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
